Bandla Ganesh : రాజకీయాల్లో బండ్ల గణేష్.. ఏపీలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ.. అందుకే చంద్రబాబుపై ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చిందా?
ప్రధానాంశాలు:
టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న బండ్ల గణేష్?
టీడీపీ టికెట్ కన్ఫమ్ అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి బండ్ల?
అందుకే చంద్రబాబును తెగ పొగిడేస్తున్నారా?
Bandla Ganesh : బండ్ల గణేష్ అనగానే మనకు గుర్తొచ్చే మరో పేరు పవన్ కళ్యాణ్. పవన్ ను బండ్ల ఎంతగా ఆరాధిస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బండ్ల గణేష్ ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా నిలదొక్కుకోగలిగాడంటే దానికి కారణం ముమ్మూటికీ పవన్ కళ్యాణ్. ఆ విషయాన్ని బండ్ల గణేష్ కూడా ఎన్నోసార్లు చెప్పాడు. పవన్ కళ్యాణ్ నా దేవుడు.. నేను ఆయన భక్తుడిని అని చెప్పుకుంటాడు బండ్ల గణేష్. గబ్బర్ సింగ్ సినిమాతో అటు పవన్ కళ్యాణ్ కు ఇటు బండ్ల గణేష్ ఇద్దరికీ ఒకేసారి బీభత్సమైన పేరు వచ్చింది. గబ్బర్ సింగ్ సినిమాతో బడా నిర్మాతగా మారిపోయాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ మళ్లీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కు చేరుకున్నారు. ఇదంతా పక్కన పెడితే బండ్ల గణేష్ మాట్లాడే తీరు చాలా వివాదాస్పదంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో కానీ.. ఇంకెక్కడైనా ఆయన వెరైటీగా మాట్లాడుతారు. ఎవరినైనా పొగడాలి అంటే ఇక ఆయన కంటే బాగా ఇంకెవ్వరూ పొగడలేరు. అలాగే.. ఎవరినైనా తిట్టాలంటే కూడా ఆయనకంటే బాగా ఇంకెవరూ తిట్టలేరు. అలా ఉంటాయి బండ్ల గణేష్ డైలాగ్స్.
చంద్రబాబును అరెస్ట్ కి వ్యతిరేకంగా.. చంద్రబాబు కోసం ఐటీ ఉద్యోగులు నిర్వహించిన సభకు బండ్ల గణేష్ హాజరయ్యారు. ఆయన ఒక్కరే కాదు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది నటులు, దర్శకులు, ఇతర టెక్నిషియన్లు, రాజకీయ నాయకులు, ఐటీ ఉద్యోగులు, ప్రజలు హాజరయ్యారు. ఆ సభలో బండ్ల గణేష్ మాట్లాడుతూ రెచ్చిపోయారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తారు. వ్యవసాయం చేసుకునే వాళ్లు.. నేడు విమానాలు ఎక్కి అమెరికాకు పోతున్నారంటే దానికి కారణం.. వాళ్ల కొడుకులు, కూతుళ్లు సాఫ్ట్ వేర్ జాబ్ చేయడం వల్లనే అంటూ చెప్పుకొచ్చారు. అసలు మామూలుగా కాదు.. చంద్రబాబు కంటే గొప్పోడు ఎవ్వరూ లేరన్నట్టుగా మాట్లాడారు బండ్ల గణేష్. ఆయన పవన్ కళ్యాన్ ను ఎప్పుడైనా ఆకాశానికి ఎత్తడం చూశాం కానీ.. చంద్రబాబుపై ఆయన ఇంత అభిమానం ఉందని ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు చంద్రబాబును మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే దాని వెనుక ఏదో ఇతర కారణం ఉంది అని ఏపీ ప్రజలు అంటున్నారు.
Bandla Ganesh : బండ్లకు ఎమ్మెల్సీ సీటు కన్ఫమ్ అయినట్టేనా?
నిజానికి బండ్ల గణేష్ ది ఏపీనే. తనది గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర్లోకి ఓ మారుమూల పల్లె. తన చిన్నతనంలోనే తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు ఆయన ఫ్యామిలీ. అప్పటి నుంచి బండ్ల గణేష్ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ పెరిగారు. ఇప్పుడు కూడా ఇక్కడే స్థిరపడ్డారు కానీ.. రాజకీయాలు మాత్రం ఏపీలో చేయాలని భావిస్తున్నారు. అందుకే.. చంద్రబాబును కాకా పట్టడం స్టార్ట్ చేశారని.. జనసేన నుంచి పోటీ చేస్తే అది పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో అనుకుంటారని.. టీడీపీ నుంచి తన సొంత జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బండ్ల గణేష్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే బండ్ల గణేష్ టీడీపీలో చేరేందుకే.. ఇలా చంద్రబాబుపై అమితమైన ప్రేమ చూపిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇది నిజమైన ప్రేమ లేక పార్టీలో చేరేందుకు బండ్ల గణేష్ వేసిన ఎత్తుగడా అనేది తెలియాలంటే ఏపీ ఎన్నికల వరకు ఆగాల్సిందే.