Rajolu : రాజోలులో జనసేన మళ్ళీ గెలుస్తుందా ..??
ప్రధానాంశాలు:
Rajolu : రాజోలులో జనసేన మళ్ళీ గెలుస్తుందా ..??
Rajolu : ఆంధ్రప్రదేశ్ మొత్తంలో జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినా రిజర్వ్ డ్ నియోజకవర్గమైన రాజోలు లో జనసేన గెలిచింది. చివరి క్షణంలో పార్టీలోకి వచ్చిన రాపాక వరప్రసాద్ కు పవన్ టికెట్ ఇచ్చారు. కానీ ఆయన ఎక్కువ రోజులు ఉండలేదు. వైసీపీలోకి చేరారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేసాయి. ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. మొత్తంగా 2 లక్షల వరకు ఓట్లు ఉంటాయి. గత ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో స్వతంత్రంగా పోటీ చేస్తే కేవలం 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో రాపాకకు వ్యక్తిగత ప్రాముఖ్యత లేదని పార్టీల బలం మీద గెలిచారని స్పష్టత వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై 800 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు.
ఈ నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు దాదాపుగా సమానంగా ఓట్లు వచ్చాయి. రాపాక కు కాస్త ఎక్కువగా రావడంతో విజేతగా నిలిచారు. తర్వాత ఆయన పార్టీ మారిపోయారు. తాను గెలిచింది జనసేన ఇమేజ్ వలన కాదని సొంత ఇమేజ్తో గెలిచానని విమర్శలు చేశారు. దాంతో ఆయనను ఓడించాలని జన సైనికులు పట్టుదలగా ఉన్నారు. రాజోలులో ఎస్సీ, కాపు ఓట్లు సమానంగా ఉన్నప్పటికీ క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు నిర్ణయించేవిగా ఉన్నాయి. కాపుల ఓటు ఏకపక్షంగా జనసేనకి పడతాయి. రఘురామకృష్ణన్ తో పాటు క్షత్రియ వర్గంతో వైసీపీ నేతల వైఖరి తీరుతో ఆ పార్టీకి క్షత్రియులు దూరమయ్యారని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పొత్తు రాజేశ్వరరావు ప్రస్తుతం జనసేన లో ఉన్నారు.
మాజీ ఐఏఎస్ కూడా జనసేన టికెట్ రేస్ లో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో రాజోలులో గెలవడానికి జనసేన ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంటుంది. టీడీపీ తో పొత్తు కుదిరిన సిట్టింగ్ సీటు కాబట్టి కచ్చితంగా జనసేనకు కేటాయిస్తారని అభిప్రాయం ఉంది. వాస్తవానికి రాజోలులో టీడీపీ కూడా బలంగా ఉంది. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే వైసీపీకి అవకాశాలు తక్కువ అని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. పొత్తు కుదరడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా పక్కన పెట్టి గట్టి అభ్యర్థిని సీటు ఇవ్వాలని వై.యస్.జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. అయితే జనసేన ను వదులుకొని వైసీపీలోకి వచ్చానని రాపాక వరప్రసాద్ తనకే సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. జనసేన లో ఉంటే తనకే అవకాశం ఇచ్చేవారని, టిడిపి తో పొత్తు ఉన్నందున సునాయాసంగా గెలిచే వాడినని, ఇప్పుడు సీటు కూడా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి మోసం చేసినట్లే అవుతుంది అని రాపాక అంటున్నారు.