TDP : స్క్రీన్‌ప్లే ఒకరిది.. యాక్షన్ టీడీపీదా!
అమరావతి : పొలిటికల్ స్ట్రాటజిస్ట్. అంటే రాజకీయ వ్యూహకర్త. ప్రస్తుత రాజకీయాల్లో వీరు పోషిస్తున్న పాత్ర మన కళ్లముందున్నదే. పవర్‌ను నిలుపుకునేందుకు అధికారపక్షం, ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్షం ఇరుపక్షాలు వీరిపై ఎంతగా ఆధారపడుతున్నాయో మనం చూస్తున్నదే. ప్రశాంత్ కిశోర్.. దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన వ్యక్తి. వైఎస్ఆర్‌సీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించి జగన్ ఏ విధంగా అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడింది తెలిసిందే. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఈయన శిష్యుడు రాబిన్ శర్మను టీడీపీ తమ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది. గత కొంతకాలంగా రాబిన్ నేతృత్వంలోనే టీడీపీ యాక్షన్ కొనసాగుతుంది. తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో కాస్త యాక్టివ్ అయిన ఆ పార్టీ రాజకీయాలు ప్రస్తుతం ఊపందుకున్నాయి.
స్తంభంగా ఉంటే జనాలు తమని మర్చిపోతారనో, ఆ మాత్రం ప్రతిపక్ష హోదా కూడా మిగలదనో లేదా మళ్లా ఎన్నికల సమయానికి కనుమరుగే అవుతామనో భయంతోనో ఏదైతేనేం మొత్తంమీద క్రీయాశీలకంగా మారుతున్నారు. రాబిన్ డైరెక్షన్ ప్లాన్‌కు చంద్రబాబు నాయుడు యాక్షన్ దూకుడును జోడించారు. అందుకే ఏ మాత్రం సందు దొరికినా దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు పాలనా వైఫల్యాన్ని ఎండగడుతూనో, ప్రజా సమస్యలను నెత్తికొత్తుకునో కాకుండా విమర్శలను ఆలంభనగా చేసుకున్నారు. పాజిటివ్ కంటే నెగెటివ్ జనాల్లోకి తొందరగా వెళ్తుందని ఇందుకు కారణమై ఉండొచ్చు. నేటి సమాచార యుగంలో పాపులర్, అన్‌పాపులర్ కావాలన్న క్షణాల్లో జరిగిపోతుంది. ఒకవైపు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు, మరోవైపు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాతో ఓ అంశాన్ని జనాల్లోకి క్షణాల్లో జొప్పించి చర్చకు పెడుతున్నారు. ప్లస్ అయితేనేం, మైనస్ అయితేనేం మొత్తం మీద మేము క్రీయాశీలంగా ఉన్నామంటూ తమ ఉనికి చాటుకుంటున్నారు. పట్టాభి అంశమే ఇందుకు ఉదాహరణగా మనం చూడొచ్చు.
రాబిన్ డైరెక్షన్‌లోనే పట్టాభి సీఎంపై తీవ్ర విమర్శలు చేసినట్లుగా సమాచారం. అనుకున్న విధంగానే వైసీపీ శ్రేణులు స్పందించి ప్రతివిమర్శలు, దాడులు చేశారు. తాము ఆశించిన ఫలితం వచ్చిందన్నట్టుగా చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై వెంటనే గవర్నర్‌తో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖలు రాయడం, 36 గంటల దీక్ష, ఢిల్లీ టూర్ ఇలా వరుసగా దూసుకుపోతున్నారు. ఇదంతా రాబిన్ శర్మ డైరెక్షన్‌లో కొనసాగుతున్న యాక్షన్‌గా సమాచారం.