వంగవీటి బ్యాక్ టు ఫామ్.. చంద్రబాబుకు ఇక ఇబ్బందులు తప్పవు
vangaveeti radha : మున్సిపోల్స్ వేళ విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తిరిగి యాక్టివ్ అయ్యారు. దాదాపు 20 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వంగవీటి రాధా మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడం చర్చనీయాంశమైంది. అయితే భవిష్యత్ లో ఇది చంద్రబాబుకు తలనొప్పిగా మారనుందన్న చర్చ జరుగుతోంది.వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన కనీసం పోటీ చేయని పరిస్థితితో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే వంగవీటి రాధా ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయ్యేవారు. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. దీంతో ఆయన ఇరవై నెలలుగా పార్టీ విషయాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా వంగవీటి రాధా రెండు, మూడు సార్లు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో వంగవీటి రాధా కీలకంగా మారారు. ప్రస్తుతం ఆయన పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు కూడా హాజరయ్యారు.
అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తన పట్టుపోకుండా ఉండేందుకే వంగవీటి రాధా యాక్టివ్ అయినట్లు చెబుతున్నారు. తొలినుంచి వంగవీటి రాధాకు సెంట్రల్ నియోజకవర్గంపైనే మక్కువ ఎక్కువ. ఇక్కడ టీడీపీ ఇన్ ఛార్జిగా బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. గత ఎన్నికల్లో బోండా ఉమ స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల్లో బోండా ఉమను కాదని, వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టిక్కెట్ ను ఇచ్చే అవకాశం లేదని సమాచారం. అయితే ఈ దఫా తనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వకుంటే, జనసేన నుంచి పోటీ చేయాలని వంగవీటిరాధా భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆయన మున్సిపల్ ఎన్నికల వేళ యాక్టివ్ అయ్యారని అటు కేడర్, ఇటు విశ్లేషకులు అంటున్నారు. అందులో భాగంగానే ఆయన తాజాగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న 21 వార్డుల్లో టీడీపీ లేదా జనసేన అభ్యర్థులను గెలిపించాలని పిలుపు ఇచ్చారని చెబుతున్నారట. ఇది టీడీపీ కేడర్ లో చర్చకు దారితీసిందట. దీన్నిబట్టి వంగవీటి రాధా సెంట్రల్ నియోజకవర్గాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరన్నది స్పష‌్టమవుతుంది.
దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ మారైనా వంగవీటి రాధా సెంట్రల్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో బొండా ఉమ స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ఇక వంగవీటి గనుక బరిలోకి దిగితే, భారీగా ఓట్లు చీలతాయన్నది విశ్లేషకుల అంచనా. పోనీ .. ఆయనకు టిక్కెట్ ఇస్తే, బొండా రెబల్ గా దిగే, అవకాశాలున్నాయన్నది మరో అంచనా.. దీంతో చంద్రబాబు పరిస్థితి విడవమంటే, పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం అన్న చందంగా మారిందన్నది విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతల్ని కాదని, మరొకరికి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వీరిద్దరిలోనే ఎవర్నో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో బాబుకు మరో తలనెప్పి తప్పదని వీరు అభిప్రాయపడుతున్నారు. దీంతో విజయవాడ సెంట్రల్ టిక్కెట్ మరో రచ్చకు దారితీయనుందని విశ్లేషకులు అంటున్నారు.