Ys Jagan : టీడీపీ నుండి వచ్చిన ఆ ఎమ్మెల్యేపై జగన్ కు పీకల్లోతు కోపం ఉందట
తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు వైకాపా నుండి వలసలను అధికంగా ప్రోత్సహించారనే విషయం తెల్సిందే. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు వైకాపాను వీడి తెలుగు దేశం పార్టీని చేరారు. ఇప్పుడు వైకాపా అధికారంలో ఉంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్న సైగ చేస్తే చాలు తెలుగు దేశం పార్టీ నుండి చంద్రబాబు నాయుడు గుడ్ బై చెప్పి వైకాపాలో జాయిన్ అయ్యేందుకు చాలా మంది సిద్దంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు సగం మంది ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువగా వలసలను ప్రోత్సహించడం లేదు. బేషరతుగా వచ్చిన వారికి మాత్రమే వైకాపాలో ఛాన్స్ ఉంటుంది.
తెలుగు దేశం పార్టీ నుండి బేషరతుగా వచ్చిన ఎమ్మెల్యేల్లో విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఒకరు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తెలుగు దేశం ను వీడి వైకాపాలో జాయిన్ అయిన ఈయన ఇటీవల జీవీఎంసీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తెర తీసింది. ఆయన నియోజక వర్గం పరిధిలో మొత్తం 13 డివిజన్లు ఉంటే అందులో కేవలం 5 డివిజన్లను మాత్రమే వైకాపా గెలుచుకుంది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వ్యవహరించిన తీరే మిగిలిన చోట్ల ఓటమికి కారణం అంటున్నారు. గెలిచిన వారు కూడా వాసుపల్లి పేరుతో గెలిచిన వారు కాదు. వారికి సొంత ఇమేజ్ ఉన్న వారే అంటున్నారు. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు.

ap cm ys jagan
అభ్యర్థుల ఎంపిక నుండి మొదలుకుని ఎన్నికల రోజు వరకు ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై విశాఖ ఇంచార్జ్ విజయ సాయి రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడట. విజయ సాయి రెడ్డితో ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడినట్లుగా చెబుతున్నారు. జీవీఎంసీలో మెజార్టీ భారీగా వచ్చే అవకాశం కేవలం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వల్లే మిస్ అయ్యిందని సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడట. చాలా నమ్మకం పెట్టుకుని బాధ్యతలు అప్పగిస్తే ఆయన తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారేమో అనే అనుమానాలను కొందరు పార్టీ నాయకులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆయనపై వైకాపా అధినేత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.