Business Idea : ఘర్ కె కుల్చె అనే సరికొత్త ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి లక్షలు సంపాదిస్తున్న తల్లీకొడుకు.. ఎక్కడో తెలుసా?
Business Idea : కొత్త పంథాలో వెళ్లడం అంత ఈజీ కాదు. రాళ్లు, ముళ్లు ఉంటాయి. వాటిని పక్కన పడేస్తూ మెళ్లిగా ముందుకు సాగాల్సి ఉంటుంది. అనుకోని కుదుపులు వస్తాయి. వాటికీ తట్టుకోగలగాలి. గమ్యం ఏమిటో తెలిసినా.. దారి మనకు మనమే నిర్మించుకుని సాగాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం ఏమాత్రం సాఫీగా సాగదు. కానీ గమ్యం చేరుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ శెభాష్ అంటారు. విజయాలను గుర్తిస్తారు. వేనోళ్ల పొగుడుతారు. గౌరవ్ ఆయన తల్లి సునీలా బహ్ల్ ఆహార రంగంలోవ్యాపారాన్నిప్రారంభించాలనుకున్నప్పుడు ఎవరినీ అనుకరించకుండా ఉండాలని అనుకున్నారు. కొత్తగా ట్రై చేయాలని ముందే నిశ్చయించుకున్నారు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా… వారు వెనక్కి తగ్గకుండా ముందుకే సాగారు. ఇప్పుడు ఢిల్లీలో చోలే కుల్చా అని చెబితే చాలు ఈ తల్లీ కొడుకులు తయారు చేసేది గుర్తుకు వస్తుంది చాలా మందికి.
గౌరవ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ చేశాడు. ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నాడు. 2016లో రియల్ ఎస్టేట్ పరిశ్రమ మందగించే సంకేతాలను ఇవ్వడంతో గౌరవ్.. కొత్త అవకాశాల వైపు దృష్టి పెట్టాడు. మిత్రుని సూచన మేరకు ఆహార రంగం వైపు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. మార్కెట్లో ఉన్న ఎవరినీ కాపీ కొట్టకుండా విభిన్నంగా ప్రయత్నించాలని అనుకున్నాడు. పరిశుభ్రమైన, సరసమైన చోలే కుల్చాను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.గౌరవ్ వాళ్ల అమ్మ సునీలా తన 55 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఉత్సాహంగా తన కుమారుడి నిర్ణయానికి మద్దతు ఇవ్వడంతో పాటు దానిలో భాగం అయ్యారు. ఇన్ గ్రీడియంట్స్, మసాలా, రుచి ఇలా ప్రతి ఒక్కటీ తనే దగ్గరుండి చూసుకున్నారు. చోలే కుల్చా రుచిపై చాలానే అధ్యయనం చేశారు.
మసాలా దినుసుల వాడకంపైనా వారు దృష్టి పెట్టారు. రెండు సంవత్సరాల విస్తృత పరిశోధన మరియు తయారీ తర్వాత, 2018లో, కూల్చాస్ తన సేవలను గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్‌లో ప్రారంభించింది. 18 రకాల కుల్చా మరియు 24 రకాల కాంబినేషన్ వంటకాలను అందిస్తోంది.అవుట్‌లెట్‌లో విక్రయించే వంటకాలన్నీ అచ్చంగా ఇంట్లో చేసుకున్నట్లుగానే ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఇంట్లో చేసుకున్నట్లుగానే మసాలా దినుసులను రుబ్బడం, తాజాదనాన్ని మరియు కల్తీ లేకుండా చూసుకున్నారు. రుచిని పెంచడంపై అలాగే ఆహార నాణ్యతపై ఎక్కువ శ్రద్ధ వహించారు. పిల్లల్లో ప్రసిద్ధి చెందిన కుల్చా పిజ్జాలు మరియు శాండ్‌విచ్‌లను అందించాలని నిర్ణయించుకున్నారు. తల్లీకొడుకుల ఔట్‌లెట్ మొదటి రోజే సుమారు వెయ్యి మంది కస్టమర్లను ఆకర్షించింది. లాభాలు నెలకు రూ. 2 లక్షల నుండి ఏడాదిలోపు రూ. 7 లక్షలకు చేరుకున్నాయి.