Business Idea : వారెవ్వా.. తాగి పడేసిన కొబ్బరి బొండాలతో కోట్లు సంపాదిస్తున్న యువకుడు..!
Business Idea : కొబ్బరిని సాధారణంగా కల్పవృక్షమని పిలుస్తారు. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగము మానవాళికి ఎంత ఉపయోగకరమో తెలిసిందే. కొబ్బరి బొండంలోని నీళ్ళు అనారోగ్యానికి గురైనప్పుడు మన అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక అందులోని కొబ్బరితో ఎన్నో స్వీట్లు, వంటలు చేసుకుంటూ ఉంటూనే ఉంటాం. అయితే కొబ్బరిని తీసిన అనంతరం దాని టెంకను మాత్రం తీసి అవతల పారేస్తాం. కానీ ఓ యువకుడు మాత్రం అందుకు భిన్నంగా అందరూ తాగి పడేసిన కొబ్బరి బొండాలతో కూడా లాభాలు పొందుతున్నాడు. ఉద్యోగాలు కరువైన ఈ రోజుల్లో ఈ వ్యర్థాలతో వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. హైదరాబాద్ లో ఇప్పుడీ యువకుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భాగ్య నగరంలోని వందల షాపుల నుంచి తాగి పడేసిన కొబ్బరి బొండాలను తీసుకొచ్చి వాటితో వ్యాపారం చేస్తున్నాడు నాగరాజు అనే యువకుడు. ఆ వ్యర్థ బొండాల నుంచి రకరకాల వస్తువులు తయారీకి ఉపయోగపడే ముడి సరుకును తన సిబ్బందితో ఉత్పత్తి చేయిస్తున్నాడు.
Business Idea : వ్యర్థాలతో కోట్ల వ్యాపారం..!
నగర శివార్లలో ఒక చిన్న ప్లాంట్ ని ఏర్పాటు చేసి.. తను ఉపాధి పొందడమే కాకుండా మరో 12 మందికి ఉపాధి చూపించి నేడు ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నగరం లో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన దాదాపు 3 టన్నుల వ్యర్థ కొబ్బరి బొండాల నుంచి నిత్యం 50 శాతం పీచు, 50 శాతం కొబ్బరి ఎరువును తయారు చేస్తూ వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ.. ఏడాదిలో కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు. మొదట ఏదో వ్యాపారం చేసి నష్టాల పాలైన నాగరాజు.. ఓటమితో కుంగి పోకుండా మళ్ళీ ధైర్యంగా ముందడుగు వేసి ఈ కొత్త వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. ఇందుకోసం 20 లక్షల పైనే పెట్టుబడి పెట్టినట్లు అయన చెప్పారు. తాను ఇప్పుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
కాస్త తెలివి ఉంటే ఏ వ్యాపారం లోనైనా విజయం సాధించవచ్చునని ఇప్పుడీ యువకుడు రుజువు చేస్తున్నాడు. దేశంలో కొబ్బరి పంట విస్తీర్ణంలో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉంది. కొబ్బరితో తయారైన ఉప ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. కొబ్బరి బొండాల ఆధారంతో చేతితో తయారుచేసిన అలంకార వస్తువులు ముందంజలో ఉన్నాయి. అలాగే కొబ్బరి బొండం పీచుతో బెడ్లు, దిండ్లు, సోఫాలు తయారు చేస్తారు.