అధిక శ్రావణ మాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చా.. చెయ్యకూడదు…?
ఈసారి మనకు శ్రావణమాసం రెండుసార్లు వస్తుంది. ఈ రెండు మాసాలలో ముందుగా వచ్చేది అధిక శ్రావణమాసం. తరువాత వచ్చేది నిజ శ్రావణమాసం. ఈ రెండు మాసాలలో అసలు నిజ శ్రావణం ఎప్పుడు జరుపుకోవాలి అంటే వరలక్ష్మీ వ్రతము మంగళ గౌరీ నోములు ఎప్పుడు నోచుకోవాలి అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఆ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం.. శ్రావణమాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ఆధ్యాత్మికత వెల్లి విరుస్తుంది. ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. హిందూ సనాతన ధర్మం ప్రకారం తెలుగు మాసాల్లో శ్రావణమాసానికి ఎంతో విశిష్టత ఉంది.ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు నెలలో వస్తుంది. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణా నక్షత్రంలో కలిసిన రోజు కాబట్టి ఈ నెలను శ్రావణం అంటారు.
తెలుగు పంచాంగం ప్రకారం జులై 18 వ తేదీ నుంచి శ్రావణమాసం మొదలుకానుంది. ఈ సంవత్సరం అధికమాసం కావడం వలన మొదట వచ్చేది అధిక శ్రావణమాసం అంటారు. అంటే జూలై 18 వ తేదీ నుండి ఆగస్టు 16 వరకు మనకు అధికమాసం వస్తుంది. మరి నిజ శ్రావణం ఎప్పుడు మొదలవుతుంది అనే విషయానికి వస్తే ఆగస్టు 17 నుంచి మొదలై సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది. అసలు ఈ అధికమాసం అంటే ఏమిటి.? అధికమాసం ఎందుకు వస్తుంది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశి లోనికి ప్రవేశించడాన్ని రాశి సంక్రమణము అంటారు. ఈ సంక్రమణము ప్రతి నెలలోను జరుగుతుంది. కానీ మనం మకర రాశి సంక్రమణాన్ని మాత్రమే మకర సంక్రాంతిగా గుర్తిస్తున్నాము. ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు రెండు నెలల పాటు ఒకే రాజులో ఉండడం వల్ల ఏర్పడేది అధికమాసం.
అధికమాసం ముందు వచ్చి ఆ తర్వాత నిజమాసం వస్తుంది. ఈ అధికమాసాన్ని మయళ మాసం అని అంటారు. అనగా ఈ అధికమాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. అంటే మనం ప్రతి సంవత్సరము శ్రావణమాసంలో జరుపుకునే పండుగలు అన్నీ కూడా నిజ శ్రావణ మాసంలోనే జరుపుకోవాలి. మరి ఈ అధికమాసంలో ఏం పూజలు చేసుకోవాలి? ఎలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని అనే విషయానికి వస్తే అధికమాసంలో ఎలాంటి పూజలు చేసుకోకూడదు. అధికమాసంలో పితృ కార్యాలు మాత్రం యధావిధిగా నిర్వహించాలని శాస్త్రం చెబుతుంది. కానీ నిజమాసంలో జరిగే పూజలు నోములేవీ కూడా అధికమాసంలో నిర్వహించకూడదు. అలాగే ఈ అధిక మాసంలో నిత్య పూజ చక్కగా చేసుకోవచ్చు. ఇక కొత్తగా పెళ్లయిన కోడల్ని మొదటి ఆషాడంలో పుట్టింటికి పంపించడం మన ఆనవాయితీ అలా పంపించిన కోడల్ని మళ్లీ తిరిగి నిజ శ్రావణ మాసంలోనే తెచ్చుకోవాలి.
అధిక శ్రావణమాసంలో తెచ్చుకోకూడదు. నిజ శ్రావణ మాసంలో శ్రావణమాసం అంటే కేవలం అమ్మవారి పూజలు నోములు మాత్రమే కాదు. శ్రావణమాసం ఆ పరమేశ్వరుడికి విష్ణుమూర్తికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి ప్రతి సోమవారం శివ పూజ అలాగే శనివారం విష్ణు పూజ అత్యంత విశేష ఫలితాలను కలిగిస్తుంది.