Kanuma Festival : కనుమ పండుగ నాడు ఏం చేయాలి ?
Kanuma Festival : హిందువులు జరుపుకొనే పండుగలలో అతిముఖ్యమైన పండుగల్లో సంక్రాతి ఒకటి. ఇది మూడు/నాలుగు రోజుల పండుగ. కొన్ని చోట్ల బోగి,సంక్రాంతి, కనుమగా మరికొన్ని చోట్ల ముక్కనుమ అని నాలుగో రోజు పండుగను చేసుకుంటారు. అయితే మొదటి రెండ రోజులు మనం చేసుకుంటే మూడో రోజు మన చుట్టూ ఉన్న ప్రకృతి, మనకు సహాయం చేసిన పశువులు, పక్షులకు కృతజ్ఞతలు చెప్పడానికి చేసుకుంటారు.అంతేకాకుండా పితృదేవతలనీ స్మరించుకుంటారు.పశుపక్ష్యాదుల పండుగమన దేశం ముఖ్యంగా గ్రామీణం. అంతేకాదు వ్యవసాయాధారిత దేశం.వ్యవసాయంలో అత్యంత కీలకమైనది పశువులు. అంటే ఎడ్లు. వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
వీటి సేవలు అద్భుతం.సంక్రాంతి అంటే మన పంటలు ఇంటికి చేరుకునే సమయం. అంటే పొలం పనులు పూర్తవుతాయి. ఇప్పటి వరకు పశువులు తమ శక్తినంతా ఉపయోగించి పంటలు చేతికి వచ్చేలా చేసిన పశువులకు ప్రస్తుతం విశ్రాంతి దొరుకుతుంది.చాలా కష్టపడి అలసి, నీరసమై పోయిన పశువులకు బలాన్ని చేకూర్చేందుకు ఉప్పుచెక్క పేరుతో వాటికి ఔషధులతో కూడిన పొట్టుని తినిపిస్తారు. మరోవైపు పశువులనీ, వాటి ఉంటే కొట్టాలనీ శుభ్రపరుస్తారు. కొట్టాలను గోమయంతోనూ, పూలదండలతోనూ అలంకరిస్తారు.రంగరంగుల అలంకరణలతో…కనుమ నాడు ముఖ్యంగా చేసే పని పశువుల అలంకరణ.
ఎద్దుల కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాల మీద పట్టుబట్టలు, కాళ్లకి గంటల గజ్జలు, మెడలో పూలదండలు.. ఇలా తమ రంగరంగ వైభవంగా పశువులని అలంకరిస్తారు. పక్షులను కూడా ఆదరించే సంప్రదాయం మనకు కనిపిస్తుంది. అందుకే ధాన్యపుకంకులను ఇంటి చూర్లకు వేడాలడదీస్తారు. వాటితో చిన్నచిన్న పిట్టలు తమ కడుపుని నింపుకోవడం కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల పెద్దలను తలచుకోవడం చేస్తారు. వీటికి గారెలు, మినుమల పదార్థాలను వంటకాలుగా చేస్తారు. పంట రావడానికి సహాయం చేసిన అందరికీ కొత్త దుస్తులు పెట్టడం, వారిని ఇంటికి పిలిచి ఆదరించడం, కానుకలు ఇవ్వడం చేస్తుంటారు.