Kanuma Festival : కనుమ రోజు కాకులు కూడా కదలవు.. మరి మీరు దాటుతున్నారా..!
ప్రధానాంశాలు:
Kanuma Festival : కనుమ రోజు కాకులు కూడా కదలవు.. మరి మీరు దాటుతున్నారా..!
Kanuma Festival : కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అవి చాలా స్ట్రాంగ్‌గా పాటిస్తారు కొందరు. మరి కొందరు లైట్ తీసుకుంటారు. దక్షిణ భారతదేశంలో కనుమ పండుగకి ప్రత్యేకమైన స్థానం ఉంది. సంక్రాంతి పండుగ మరుసటి రోజు వస్తుంది. కనుమ పండుగను రైతులు, పశువులను పూజించేవారు మరియు కుటుంబ సభ్యులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని మన పెద్దలు చెబుతారు. ప్రయాణం చేస్తే అపశకునం అని కొందరు నమ్ముతారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చారిత్రాత్మకమైనవి, కొన్ని సాంప్రదాయపరమైనవి, మరికొన్ని ఆరోగ్యపరమైనవి.అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని, కనీసం ఊరి పొలిమేరలు కూడా దాటకూడదని అంటారు.
Kanuma Festival ఎందుకు దాటకూడదు..
అయితే కనుమ రోజు ఊరి పొలిమేర కూడా దాటకూడదని అంటారు. ఒక నానుడి ప్రకారం కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికీ కదలవని అంటారు. అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరాదని మన పూర్వీకులు అంటారు. పల్లెల్లో నివసించే ప్రజలకు పశువులే పెద్ద సంపద. ఏడాది మొత్తం రైతుకు చేదోడు వాదోడుగా ఉంటూ కష్టించే పశువులను కనుమ రోజు పూజించడం మన సంప్రదాయం. కనుమ రోజు ఉదయాన్నే పశువులను ఊళ్లోని చెరువుల వద్దకు తీసుకెళ్లి వాటిని శుభ్రంగా కడిగి, వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. పసుపు కుంకుమలతో పశువులను అలంకరిస్తారు. వాటి కాళ్లకు చిరు మువ్వల పట్టీలు కట్టి సంబరపడిపోతాడు. మెడలో చిరుగంటలు కడతారు. అనంతరం పశువులకు హారతి ఇచ్చి, మంచి ఆహారాన్ని అందిస్తారు. కనుమ రోజు పశువులను పూజించుకునే గొప్ప సంస్కృతి తెలుగు వారికే సొంతం.
శ్రమైక జీవనంలో కష్టపడుతున్న పశువులకు రైతు ఇచ్చే గౌరవమే కనుమ రోజున ఇచ్చే విశ్రాంతి. ఈ ఒక్క రోజు కూడా వాటిని ఇబ్బంది పెట్టకూడదన్న ఔన్నత్యం ఈ నిబంధన అప్పటి నుండి ఉంది. అంతే కాకుండా భోగి, సంక్రాంతి పండుగ హడావుడిలో గడిచిపోతుంది. అందరూ కలిసి సరదాగా గడిపేందుకు కూడా కనుమ పండుగ రోజు తిరుగు ప్రయాణం చేయకూడదని అంటారు.ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు కదా అన్నీ మోటారు వాహనాలు కదా! ఎందుకు ప్రయాణించకూడదు అని అంటారేమో! సంవత్సరానికి ఒక్కసారి ఊరికి వస్తారు ఇంకో రోజు మీ సొంత ఊరిలో బంధుమిత్రులతో సరదాగా గడపండి. తరువాత ఎలాగూ యాంత్రిక జీవనం తప్పదు. ఇదే కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం అనడం వెనుక ఉన్న అంతరార్థం. కనుమ రోజున, ప్రజలు తమ పూర్వీకులను స్మరించుకుంటారు. వారికి పిండ ప్రదానాలు చేస్తారు. ఆ రోజు ప్రయాణాలు చేస్తే, పూర్వీకులకు చేసే కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని నమ్ముతారు.