ఫిబ్రవరి 27 మాఘపౌర్ణమి : మీరు ఇలా చేస్తే అలభ్యయోగం మీ సొంతం !
Magha Pournami 2021 : మాఘపౌర్ణమి : సనాతన ధర్మంలో ప్రతిమాసానికి అనేక విశేషాలు ఉంటాయి. ఆయా మాసాలలో చేసే పనుల ద్వారా మనకు అనేక మంచి ఫలితాలు కలుగుతాయి. పవిత్రమైన, శుభకరమైన మాసాలలో మాఘమాసం ఒకటి. ఈ మాసంలో కార్తీక మాసంలో లాగానే స్నానానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. శివారాధన, సూర్యారాధన విశేషంగా చేస్తారు. అయితే ఈమాసం మొత్తం ప్రాతఃకాలంలో స్నానం చేయడం ద్వారా విశేషాలు లాభాలు వస్తాయి. అయితే ఈ కలికాలంలో అన్నిరోజులు వ్రతవిధానంగా స్నానం చేయడం సాధ్యం కాకపోవచ్చు. వారి కోసం పెద్దలు సూచించిన తిథి పౌర్ణిమ తిథి. ఈ విశేషాలు తెలుసుకుందాం….
మాఘ పూర్ణిమను ‘మహామాఘం’ అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. మహా మాఘి ఇది విశేష పర్వదినం. స్నానదాన జపాలకు అత్యంత అనుకూలమైన రోజు. మరీ ముఖ్యంగా ఈ రోజున సముద్రస్నానం మహిమాన్వితమైనదిగా పండితులు పేర్కొంటున్నారు.
Magha Pournami 2021 : పౌర్ణమి స్నానం !
కార్తీకమాసంలో లాగానే స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయానికి ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయానికి ముందే శాస్త్రం చేప్పిన విధివిధానంగా చేసే స్నానం) ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి. ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం అనేక విశేష ఫలితాలు ఇస్తుంది.
తిధుల్లో ఏ పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇష్టదేవతారాధన, ధ్యానం, జపాది అనుష్టానాలు మంచి ఫలాన్ని ఇస్తాయి.
‘’ వైశాఖీ కార్తీకీ మాఘీ
తిథయో౭ తీవ పూజితాః!
స్నాన దాన విహినాస్తా
ననేయాః పా౦డున౦దన!! ‘’
అన్ని పూర్ణిమల్లోకి మాఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతొ ఉత్కృష్టమైనవి. వాటిని వ్యర్ధంగా వృథా చేసుకోరాదని ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి. స్నానదాన జపాది సత్కర్మలు లేకు౦డా వృథాగా ఈ మూడు మాసాలు పూర్ణిమలను గడుపరాదు. మాఘ పూర్ణిమ నాడు ” అలభ్య యోగం” అని కూడా అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగ మవుతుంది. భక్తి, శ్రద్ధలతో ఇంట్లో లేదా నదీ లేదా సముద్ర స్నానం ఎవరికి ఏది వీలైతే దాన్ని ఆచరించి భగవంతుడి అనుగ్రహాన్ని పొందండి.