అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలా? కొనకుంటే ఏమవుతుంది ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలా? కొనకుంటే ఏమవుతుంది ?

 Authored By keshava | The Telugu News | Updated on :13 May 2021,3:38 pm

అక్షయ తృతీయనాడు చాలామంది బంగారం కొనాలి అని ఆరాటపడుతారు. అయితే ఈరోజున నిజంగా బంగారం కొనుగోలు చేయాలా? చేయకుంటే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం..

అక్షయ తృతీయ రోజు పవిత్రమైనదిగా పూర్వకాలం నుంచి ఆచరిస్తున్నారు. అయితే ఈరోజు ధనాధిపతిగా కుబేరుడు నియమితుడైన రోజుగా పేర్కొంటారు. అయితే ఈరోజున సంపదకు సంబంధించినది కాబట్టి బంగారం కొంటే మంచి జరుగుతుందని భావిస్తారు. కానీ నిజానికి ఈరోజు దానికంటే ముఖ్యంగా చేయాల్సినది దానధర్మాలు. ఈ రోజు ఉపవాసం చేసినా అక్షయ ఫలితం వస్తుంది. అక్షయ తృతీయ రోజున చేసిన హోమాలు, దానాలు, పితృదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు, క్షయం కాకుండా స్థిరంగా ఉంటాయి కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు తెలియజేశాడు.
కేవలం దాన ధర్మాలకు, ఆధ్యాతిక చింతనకు,సేవా దృక్పథానికి ప్రత్యేకత కలిగినదే అక్షయ తృతీయ. ఈరోజున ఇష్ట దైవం పూజ, వ్రతం, మంత్ర సాధన చేస్తూ ఈ కరోనా కాలంలో ఇంట్లో పనులు చేసుకుంటూనే భగవద్గీత పారాయణం, ఆధ్యాత్మిక సందేశాలు వినడం ఉత్తమం.ముఖ్యంగా రోగులకు సేవ, పేదలకు అన్నదానం, గోవులు, పశు పక్ష్యాదులకు దాణా, తాగడానికి నీటిని ఏర్పాటు చేయాలి. బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలి వేంద్రాలు ఏర్పాటుచేయడం ఎంతో పుణ్యఫలం. ఓ రెండు ముద్దలు పక్షులకు పెడితే పితరులకు పెట్టినట్టే. కేవలం బంగారం కొనడం ద్వారా కాదు. బంగారం కొంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి తెచ్చుకున్నామనే భ్రమ విడువాలి.

should we buy gold on akshaya trutiya

should we buy gold on akshaya trutiya

పురాణల ప్రకారం.. ఈ రోజున ఉపవాస దీక్ష చేపట్టి ఏ పుణ్య కర్మ ఆచరించినా దాని ఫలం అక్షయంగా లభిస్తుంది. ఈ రోజు అక్షతోదకంతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించాలి. తరువాత వాటిలో కొన్ని తీసి గోవునకు ఆహారంగా అరటి పండ్లు, బెల్లం కలిపి దానమిచ్చి మిగిలిన వాటిని ఏదైని రూపంలో వండి దైవ ప్రసాద భావనతో స్వీకరించి భోజనం చేసిన వారికి అక్షయ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఉంది.

అక్షయ తృతీయ దీక్ష

ప్రతి ఏడాది వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించి.. ఏడాది పొడువునా 12 మాసాలలో శుక్లపక్ష తృతీయ నాడు ఉపవాసం ఉండి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయయాగం చేసిన ఫలితం దక్కుతుంది. అంతేకాదు అంత్యంలో ముక్తిని పొందుతారు. అక్షింతలు అంటే ఏ మాత్రం విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యం. ఎవరి శక్తిని అనుసరించి వారు పూజలు, దానాలు చేయాలి. లేదని భావించవద్దు. శక్తిమేరకు చేసే చిన్న దానధర్మం అమితమైన ఫలితం ఇస్తుంది. భక్తి, శ్రద్ధ అనేవి చాలా కీలకం. ఏదీ వీలుకాకుంటే ప్రాతఃకాలంలో లేచి భగవాన్‌ విష్ణుమూర్తి అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లేదా వేంకటేశ్వరుడు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపంలోని శ్రీహరిని భక్తితో ప్రార్థించి, ధాన్యం, నమస్కారం చేసుకుంటే తప్పక స్వామి అనుగ్రహిస్తాడు.

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది