7000 మామిడిపండ్లతో స్వామివారు, అమ్మవార్లకు అలంకరణ.. వైరల్ ఫొటో..!
అక్షయ తృతీయ సందర్బంగా సాధారణంగానే చాలా మంది బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆలయాల్లో దేవుళ్లకు ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తుంటారు. ఇక మహారాష్ట్రలోని ఆ ప్రాంతంలో ఉన్న ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. అయితే స్వామి వారు, అమ్మవారిని వేల సంఖ్యలో మామిడి పండ్లతో అలంకరించడం ఆకట్టుకుంటోంది.
మహారాష్ట్రలోని పంధార్‌పూర్‌లో ఉన్న విఠల-రుక్మిణీ ఆలయంలో అక్షయ తృతీయ సందర్బంగా స్వామి వారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ ఇద్దరినీ భారీ సంఖ్యలో మామిడిపండ్లతో అలంకరించారు. అందుకు గాను మొత్తం 7000 మామిడి పండ్లు అవసరం అయ్యాయి. ఆ ఆలయంలో ఉన్న ఇతర దేవుళ్లు, దేవతల ఆలయాల్లోనూ విగ్రహాలను మామిడి పండ్లతో అలంకరించారు.
అయితే ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతేడాది కూడా అక్షయ తృతీయ సందర్బంగా ఆలయంలో దేవుళ్లు, దేవతలను 3100 మామిడిపండ్లతో అలంకరించారు. ఇక ఇప్పుడు ఆ సంఖ్యను పెంచారు. అయితే అలంకరణను తీసేశాక ఆ మామిడి పండ్లను హాస్పిటళ్లలో కోవిడ్ బాధితులకు అందజేశారు. అలాగే స్వామి వారు, అమ్మవార్లను పుచ్చకాయలు, యాపిల్ పండ్లు, ఇతర పండ్లతోనూ అలంకరించగా, వాటిని తీసేశాక వాటిని కూడా బాధితులకు పంపిణీ చేశారు. కాగా దేవుళ్లను అలా మామిడి పండ్లతో అలంకరించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.