Tirupati : తిరుపతికి వెళ్లినప్పుడు కచ్చితంగా ఇవి చేయాలి.. అలాగే ఇవి అస్సలే చేయకూడదు!
Tirupati : ఆ ఏడు కొండల వాడిని అంటే తిరుమల తిరుపతికి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లినప్పుడు కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలని, అలాగే కొన్ని అస్సలే చేయకూడదని వేద పండితులు సూచిస్తున్నారు. అయితే తిరుమలకు బయలు దేరే ముందు మీమీ ఇష్ట దేవతలను పూజించండి. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించే ముందు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి, శ్రీ వరాహ స్వామిని పూజించండి. స్నానం చేసి శుచిగా, శుభ్రమైన వస్త్రాలతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించండి. మీరు ఆలయంలో ఉన్నపుడు స్వామి వారిపైనే మనసును నిలపండి.
ఆలయంలో పూర్తిగా నిశ్శబ్దాన్నిపాటిస్తూ “ఓం శ్రీ వేంకటేశాయ నమః” అని మీలో మీరు శ్రీవారిని స్మరించండి. తిరుమల సమీపంలో వున్న ఆకాశ గంగ, పాప నాశనం తీర్థాలలో స్నానం చేయండి. తిరుమలలో ఉన్నపుడు మన ప్రాచీన ఆచార వ్యవహారాలను విధిగా పాటించండి. సాటి యాత్రికులను గౌరవించి వారిలో భక్తి భావాలు పెంపొందించండి. అలాగే మీరు సమర్పించాలి అనుకున్న కానుకలను శ్రీవారి హుండీలోనే సమర్పించండి. శ్రీవారి ఆలయంలో మీరు జరిపించదలచిన పూజలకు గాని, మీకు కావలసిన సమాచారం కోసం గాని తిరుమలలోని లేదా తిరుమల తిరుపతి దేవ స్థానం వారి ఏ సమాచార కేంద్రంలో అయినా అడగండి.తిరుమలలో చేయ కూడనివి… విలువైన ఆభరణాలు, ఎక్కువ డబ్బు మీ వద్ద వుంచుకోకండి.
మాంసా హారాన్ని భుజించకండి. ఏ విధమైన మత్తు పదార్థాలు సేవించకండి. పొగ త్రాగ కండి. ఆలయ పరిసరాల్లో పాదరక్షలు ధరించకండి. శ్రీ వారి దర్శనం కోసం కాకుండా వేరే ఇతర ఉద్దేశాలతో తిరుమలకు రాకండి. ఆలయ ప్రాంగణంలో ఉమ్మి వేయటం వంటి అసహ్య కరమైన పనులు చేయకండి. ఆచార వ్యవహారాల ప్రకారం ఆలయ అర్హత లేని సందర్భాలలో ఆలయంలోకి రాకండి. తిరుమలలో పువ్వులు పెట్టుకోకండి. పువ్వులన్నీ శ్రీ వారి పూజకే. పరిసరాలను అపరి శుభ్రం చేయకండి. అలాగే ఆలయ నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలి. పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తామంటే అస్సలే కుదరదు. తిరుమలలో ఉన్నప్పుడు తప్పుకుండా పాటించాల్సిన కొన్ని ఉంటాయి. వాటిని పాటిస్తే అటు ఆ దివ్య క్షేత్రాన్ని గౌరవించడంతో పాటు చట్ట పరంగా చర్యలు ఎదుర్కోకుండా ఉండగలం.