Gowtam Tinnanuri : కింగ్‌డమ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది : గౌతమ్ తిన్ననూరి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gowtam Tinnanuri : కింగ్‌డమ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది : గౌతమ్ తిన్ననూరి

 Authored By ramu | The Telugu News | Updated on :5 August 2025,8:30 am

ప్రధానాంశాలు:

  •  Gowtam Tinnanuri : కింగ్‌డమ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది : గౌతమ్ తిన్ననూరి

Gowtam Tinnanuri  : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’ kingdom movie . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. ప్రేక్షకులను మెప్పు పొందుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ‘కింగ్‌డమ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో.. తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Gowtam Tinnanuri కింగ్‌డమ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది గౌతమ్ తిన్ననూరి

Gowtam Tinnanuri : కింగ్‌డమ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది : గౌతమ్ తిన్ననూరి

Gowtam Tinnanuri : కింగ్‌డమ్ విడుదలకు ముందు, విడుదల తరువాత ఎలా ఉన్నారు?

విడుదలకు ముందు చివరి నిమిషం వరకు కూడా తుది మెరుగులు దిద్దడానికి ప్రయత్నిస్తుంటాం. దాని వల్ల నిద్ర కూడా సరిగా ఉండదు. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూశాక ప్రశాంతంగా నిద్రపోయాను.

Gowtam Tinnanuri : కింగ్‌డమ్ అనే టైటిల్ పెట్టడానికి కారణం?

ఏ సినిమాకైనా కథ రాసేటప్పుడు మొదట ఒక టైటిల్ అనుకుంటాం. జెర్సీ సినిమాకి కూడా మొదట అనుకున్న టైటిల్ 36. ఆ తర్వాత జెర్సీ టైటిల్ పెట్టాం. అలాగే, కింగ్‌డమ్ కథ రాసే సమయంలో కూడా కొన్ని టైటిల్స్ అనుకున్నాం. ఇందులో తెగ నాయకుడి పేరు ‘దేవర నాయక’. దాంతో అదే టైటిల్ పెట్టాలనుకున్నాం. కానీ, ఎన్టీఆర్ గారి దేవర రావడంతో.. మరో కొత్త టైటిల్ చూశాం. ‘యుద్ధకాండ’ అనే టైటిల్ ను పరిశీలించాం కానీ, చివరికి ‘కింగ్‌డమ్’ని ఖరారు చేశాం. కింగ్‌డమ్ అయితే అన్ని భాషల ప్రేక్షకులకు చేరువవుతుందనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. నా దృష్టిలో కింగ్‌డమ్ అంటే మనకి కావల్సిన వాళ్ళందరూ ఉండే ప్రాంతం లేదా మనం సురక్షితంగా ఉండే ప్రాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇల్లు లాంటిది.

హృదయం లోపల పాటను తొలగించడానికి కారణం?

సినిమా విడుదలైన తరువాత.. అది చాలా పాపులర్ సాంగ్ కదా, దానిని ఎందుకు తొలగించారని అందరూ అడుగుతున్నారు. ఓటీటీ వెర్షన్ లోనైనా జోడించమని అడుగుతున్నారు. కథ రాస్తున్నప్పుడు ఆ సాంగ్ అవసరం అనిపించింది. కానీ, ఎడిటింగ్ సమయంలో కథ గమనానికి అడ్డంకిగా సాంగ్ మారింది అనిపించింది. అందుకే నేను, ఎడిటర్ నవీన్ నూలి గారు, నాగవంశీ గారు, విజయ్ గారు అందరం చర్చించుకొని.. హృదయం లోపల పాటను తొలగించాలని నిర్ణయించడం జరిగింది. ఓటీటీ వెర్షన్ లో ఆ సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ కూడా జోడించే ఆలోచన ఉంది. నాగవంశీ గారితో చర్చించి దానిపై నిర్ణయం తీసుకుంటాం.

ఈ కథ రాసుకున్నప్పుడే విజయ్ గారితో చేయాలి అనుకున్నారా?

ఈ కథ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఈ కథకు తగ్గ నటుడు దొరికినప్పుడు చేయాలనే ఉద్దేశంతో.. పూర్తిస్థాయిలో డెవలప్ చేయనప్పటికీ, కథను రాసి పెట్టుకున్నాను. మొదట విజయ్ గారితో చేద్దామనుకున్న కథ వేరు. కానీ, మా ప్రయాణం మొదలైన తరువాత.. విజయ్ గారికి ఈ కథ సరిగ్గా సరిపోతుంది అని భావించి, ఆయనకు చెప్పడం జరిగింది. విజయ్ గారికి కూడా ఈ కథ చాలా నచ్చింది.

మళ్ళీరావా, జెర్సీ సినిమాలతో ఎమోషనల్ డైరెక్టర్ గా పేరు పొందారు. కింగ్‌డమ్ కి యాక్షన్ బాట పట్టడానికి కారణం?

ఏ కథయినా, ఏ సన్నివేశమైనా అందులో ఉన్న ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయగలగాలి. కింగ్‌డమ్ విషయంలో కూడా అదే సూత్రం ఫాలో అయ్యాను. ఇందులో యాక్షన్ ఉన్నప్పటికీ, దాని చుట్టూ బలమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కనెక్ట్ అయింది కాబట్టే, యాక్షన్ వర్కౌట్ అయింది.

మురుగన్ పాత్రకి కొత్త నటుడు వెంకటేష్ ని తీసుకోవడానికి కారణం?

ఈ సినిమాలో విజయ్ గారు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అక్కడ మనకు తెలిసిన నటుడు కంటే కూడా.. కొత్త నటుడైతే చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది అనిపించింది. ఈ క్రమంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేష్ పేరుని సూచించడం జరిగింది. ఆడిషన్ సమయంలో సినిమా పట్ల, నటన పట్ల వెంకటేష్ తపన చూసి.. వెంటనే ఆయనను ఎంపిక చేశాము.

సత్యదేవ్ గారి ఎంపిక గురించి?

శివ పాత్ర కోసం ముందు నుంచీ నేను సత్యదేవ్ గారినే అనుకున్నాము. కానీ, ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దానికితోడు అప్పుడు మా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై స్పష్టత లేదు. ఎప్పుడైతే మాకు షూటింగ్ విషయంలో స్పష్టత వచ్చిందో.. అప్పుడు సత్యదేవ్ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా కథ విని, సినిమా చేయడానికి వెంటనే అంగీకరించారు.

ఈ వ్యవధిలో ‘మ్యాజిక్’ అనే సినిమా కూడా చేశారు కదా?

నాకు, వంశీ గారికి సంగీతం నేపథ్యంలో ఒక సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. కింగ్‌డమ్ షూటింగ్ కి సమయం పడుతుండటంతో.. ఆ గ్యాప్ లో మ్యాజిక్ సినిమాని చేయడం జరిగింది. ఆ సినిమాకి ప్రధాన బలం సంగీత దర్శకుడు అనిరుధ్ గారు, సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ గారు.

కింగ్‌డమ్ రెండో భాగం ఎప్పుడు మొదలవుతుంది?

రెండో భాగానికి సంబంధించిన మూల కథ ఉంది. స్క్రిప్ట్ వర్క్ కూడా త్వరలో ప్రారంభిస్తాం. అయితే పార్ట్-2 కంటే ముందుగా.. మురుగన్, సేతు పాత్రల నేపథ్యంలో ఓటీటీ కోసం ఓ వెబ్ ఫిల్మ్ చేయాలని భావిస్తున్నాము.

దర్శకుడిగా ఈ ఎనిమిదేళ్ల ప్రయాణం ఎలా ఉంది?

ఇంకొన్ని ఎక్కువ సినిమాలు చేసి ఉండాల్సింది అనిపించింది. అయితే కొన్ని కొన్ని మన చేతుల్లో ఉండవు. కోవిడ్ కారణంగా రెండేళ్లు పోయాయి. అలాగే ఒక్కోసారి స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. నా తదుపరి సినిమాలను వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది