Piyush Goyal : అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ ని భాగ్యనగరం చేస్తాం.. కేంద్రమంత్రి పియూష్ గోయల్
Piyush Goyal: హైదరాబాద్ నగర పేరును మారుస్తామని కమలనాథులు ఎప్పటినుంచో చెబుతున్న మాట. దేశంలో ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముస్లిం పేరుతో ఉన్న కొన్ని నగరాలు, పట్టణాల పేర్లను మార్చారు. తెలంగాణ బీజేపీ నేతలతో పాటు కేంద్రం నేతలు కూడా హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని చెబుతున్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నగరానికి చేరుకున్న కేంద్రమంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అందరితో చర్చించి నగరపేరును భాగ్యనగరంగా మార్చుతామని అన్నారు.
దేశంలో ఇప్పటికే ఔరంగాజేబ్ రోడ్డు, అలహాబాద్, ఫైజాబాద్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్ వంటి నగరాల పేరును మార్చేశారు. ఇప్పుడు ఇదే వరుసలో హైదరాబాద్ ను చేర్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పియుష్ గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా మద్దతు తెలిపారు. నగరంలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల అనంతరం కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా మార్చి తీరుతామని అధికారంలోకి వచ్చిన తర్వాత చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.
Piyush Goyal : గతంలో ఉన్న పేరే కదా..
దీనికి కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా పలికితే తప్పేంటని ప్రశ్నించారు. గతంలో ఉన్న పేరే కదా… చాలా రాష్ట్రాలకు గతంలో ఒకపేరు ఉంటే ఇప్పుడు మరో పేరుతో పిలవడం లేదా.. అన్నారు. హైదరాబాద్ నగరం సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఇచ్చిన గిఫ్ట్ అని గుర్తుచేశారు. పటేల్ కాంగ్రెస్ నేత అయినప్పటికీ మోడీ ప్రభుత్వం గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.