Anemia : మహిళల్లో వచ్చే రక్తహీనత సమస్య.. కారణాలు, తీసుకోవాల్సిన ఆహారాలు..
Anemia : రక్తహీనత మన దేశంలో చాలా మందికి ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ప్రసవ వయస్సులో ఉన్న స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. భారతదేశంలో ప్రసూతి మరణాల వెనుక ఉన్న ప్రధాన కారణాలలో రక్తహీనత కూడా ఒకటి. మహిళలు, పిల్లలు మాత్రమే కాదు పురుషులు కూడా చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
రక్తహీనత అనేది ఐరన్ లోపం లేదా ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేదా రక్తంలో హిమోగ్లోబిన్ లేనప్పుడు ఎదురయ్యే పరిస్థితి. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళడానికి సహాయపడే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడానికి ఐరన్ అవసరం. ఇది శక్తిని తయారు చేయడానికి, విభిన్న విధులను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.
Anemia : రక్తహీనతకు కారణమేమిటి ?
ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు ఎ, సి, బి-కాంప్లెక్స్ గ్రూపులోని ఇతర విటమిన్లు.. తదిరత పోషకాలు సరిపోకపోవడం వల్ల ఎక్కువగా రక్తహీనత వస్తుంది. రక్తహీనతకు ఐరన్ లోపం చాలా సాధారణ కారణం. విటమిన్ బి 12 లేకపోవడం లేదా మన శరీరం విటమిన్ బి 12 ను గ్రహించలేకపోవడం, ఫోలిక్ యాసిడ్ లేకపోవడం లేదా ఫోలిక్ యాసిడ్‌ను శోషించుకోవడంలో ఇబ్బంది, వారసత్వంగా వచ్చే రక్త రుగ్మతలు, హెమరాయిడ్స్ వల్ల రక్తం కోల్పోవడం, అల్సర్ వంటివి రక్తహీనతకు ఉన్న ఇతర కారణాలు. హెచ్‌ఐవీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రోన్స్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా రక్తహీనతకు కారణమవుతాయి.
Anemia : మహిళల్లోనే అధికం
మహిళలకు అనేక కారణాల వల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. రుతుస్రావం ఉన్న మహిళలు ప్రతి నెలలో వారి పీరియడ్స్ సమయంలో రక్తాన్ని కోల్పోతారు. నెలవారీ రుతు చక్రంలో కోల్పోయే రక్తాన్ని భర్తీ చేసేందుకు, కొత్త రక్తాన్ని తయారు చేయడానికి ఐరన్ అవసరం. ఎక్కువ కాలం అధికంగా రక్తస్రావం అయ్యే మహిళల్లో రక్తహీనత సమస్య వస్తుంది. శిశువు సరైన పెరుగుదలకు గర్భధారణ సమయంలో మహిళలకు అదనపు ఐరన్ అవసరమని కూడా గమనించాలి. గర్భిణీ స్త్రీలకు సాధారణ మహిళల కంటే 50 శాతం ఎక్కువ రక్తం అవసరం. ప్రసవ సమయంలో మహిళలు రక్తాన్ని కోల్పోతారు. ఈ కారణాల వల్ల మహిళల్లోనే ఎక్కువగా రక్తహీనత సమస్య ఏర్పడుతుంటుంది.
ఏ ఆహారాలు తీసుకోవాలి ?
మహిళలు సరైన ఆహారాన్ని, పోషకాలు కలిగిన పదార్థాలను నిత్యం తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. మటన్, బీన్స్, కాయధాన్యాలు, ఆకు కూరగాయలు, ఐరన్‌తో కూడిన ధాన్యాలు, ఎండుద్రాక్ష వంటి ఆహారాలు, ఆప్రికాట్లు తదితర ఆహారాల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ బి 12 ఉండే డైరీ ఉత్పత్తులు, మాంసం, సోయా, బలవర్థకమైన తృణధాన్యాలు, నారింజ, ద్రాక్షపండ్లు, టమోటాలు, బ్రోకలీ, స్ట్రాబెర్రీలు, ఫోలేట్ ఉండే పచ్చి బఠానీలు, కిడ్నీ బీన్స్, వేరుశెనగ, ముదురు ఆకుకూరలు, ఆస్పరాగస్, అవకాడో, పాలకూర, స్వీట్ కార్న్ వంటి పదార్థాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఐరన్‌తోపాటు పలు పోషకాలు కూడా లభిస్తాయి. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.