Health Tips : జలుబు, దగ్గులకి మంచి ఉపశమనం ఇచ్చే… టమాటా మిరియాల రసం…
Health Tips : మన భారతీయులు వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయలో టమాటాలు కూడా ఒకటి. టమాటాలను ఆహారంగా తీసుకోవడం వలన ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. టమాటాను అన్ని కూరలలో వేసుకొని కూడా చేసుకోవచ్చు. అయితే టమాటాలతో ముఖ్యంగా టమాట రసం చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే టమాటా రసంలో మిరియాలు వేసుకొని చేస్తే దగ్గు, జలుబు సమస్యల నుంచి బయట బయటపడవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు: 1) టమాటాలు 2) చింతపండు 3) పసుపు 4) ఉప్పు 5)శనగపప్పు 6) మినపప్పు 7) జీలకర్ర 8) ధనియాలు 9) మెంతులు 10) ఎండుమిర్చి 11) మిరియాలు 12) దాల్చిన చెక్క 13) ఎండు కొబ్బరి 14) వెల్లుల్లి 15) కారం 16) వాటర్ 17) ఆయిల్ 18) కరివేపాకు 19) ఉల్లిపాయ
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో తరిగిన నాలుగు టమాటా ముక్కలను, 10 గ్రాముల చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, అరకప్పు వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత వాటిని పప్పు గుత్తితో లేదా గంటెతో మెత్తగా చేసుకోవాలి. తర్వాత లీటర్ నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ జీలకర్ర ,అర టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ మెంతులు, ఒక దాల్చిన చెక్క, రెండు ఎండు కొబ్బరి ముక్కలు, మిరియాలు ఒక టీ స్పూన్, రెండు ఎండుమిర్చిలను, అర టీ స్పూన్ ఆవాలు, ఒక రెబ్బ కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక జార్లోకి తీసుకొని ఇందులో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో తాలింపు చేసుకోవాలి. తాలింపు వేగాక ముందుగా తయారు చేసుకున్న టమాటా రసాన్ని వేయాలి. తర్వాత పావు టీ స్పూన్ కారం, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ రసాన్ని పొంగు వచ్చేవరకు మరిగించాలి. చివరలో కొత్తిమీర వేస్తే ఎంతో రుచిగా ఉండే టమాటా మిరియాల రసం రెడీ అవుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు ఇలా వేడివేడిగా టమాటా మిరియాల రసాన్ని అన్నంలో కలిపి తినడం వలన ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.