Banks : యువ గ్రాడ్యుయేట్‌లకు బ్యాంకుల ఆఫర్.. నెలకు రూ.5 వేల స్టైఫండ్
ప్రధానాంశాలు:
Banks : యువ గ్రాడ్యుయేట్‌లకు బ్యాంకుల ఆఫర్.. నెలకు రూ.5 వేల స్టైఫండ్
Banks 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్‌లను అప్రెంటిస్‌లుగా నియమించుకోవడానికి బ్యాంకులు యోచిస్తున్నట్లు పరిశ్రమల ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ సమయంలో ప్రత్యేక నైపుణ్యంపై శిక్షణ పొందిన అభ్యర్థులకు రుణదాతలు నెలకు రూ. 5,000 స్టైఫండ్‌ను చెల్లిస్తారని ఇండస్ట్రీ లాబీ గ్రూపింగ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటనను అనుసరించి ఈ చర్య తీసుకోబడింది. దీని ప్రకారం రాబోయే ఐదేళ్లలో 1 కోటి మంది యువతకు టాప్-500 కంపెనీలలో ఇంటర్న్‌షిప్‌లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకాన్ని అమలు చేయడంలో బ్యాంకుల పాత్రను మెహతా వివరిస్తూ.. మార్కెటింగ్, రికవరీల కోసం మనకు నైపుణ్యం లేని మానవశక్తి అవసరం అయేటువంటి చాలా రంగాలు ఉన్నట్లు, తాము వారికి ఆయా రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
అలాగే వారు తమకు తాము ఉపాధిని సృష్టించుకోవచ్చు అని తెలిపారు. అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21-25 సంవత్సరాల మధ్య గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. పన్ను చెల్లింపుదారు కాకూడదు. ఐఐటి లేదా ఐఐఎం వంటి అగ్రశ్రేణి సంస్థల నుండి డిగ్రీని కలిగి ఉండకూడదని మెహతా చెప్పారు. బ్యాంకింగ్ సేవలను చివరి మైలు వరకు తీసుకెళ్లడానికి 12 నెలల వరకు నియమించుకునే అటువంటి అప్రెంటిస్‌లను బిజినెస్ కరస్పాండెంట్‌లుగా పని చేయడం వంటి ఇతర రంగాల్లో కూడా నియమించుకోవచ్చని మెహతా సూచించారు. అలాంటి అభ్యర్థులు బ్యాంకుల్లో పనిచేసిన తర్వాత వారిలో కొందరు ఉద్యోగులుగా చేరే అవకాశం కూడా ఉందన్నారు.
ఈ పథకం అమలుకు సంబంధించి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శితో IBA గడిచిన గురువారం సమావేశాన్ని నిర్వహించిందని, ఇది ఒక నెలలోపు అమలులోకి రావచ్చని మెహతా తెలిపారు. అయితే, బ్యాంకులు నియమించుకునే మొత్తం ఇంటర్న్‌లు లేదా అప్రెంటిస్‌ల సంఖ్యను అతను తెలుపలేదు. అయితే అన్ని బ్యాంకులు ఈ చొరవలో పాల్గొంటాయని తెలిపారు. పథకం అమలుకు ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని పేర్కొన్నారు.