Congress : గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్‌ అన్వేషణ… లోక్‌సభ టిక్కెట్ల కోసం పోటాపోటీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Congress : గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్‌ అన్వేషణ… లోక్‌సభ టిక్కెట్ల కోసం పోటాపోటీ..!

 Authored By tech | The Telugu News | Updated on :11 March 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  రేసులో పలువురు సీనియర్లు, వారసులు

  •  పార్టీ అంతర్గత సర్వేలతోపాటు, సామాజిక కూర్పుపై హైకమాండ్‌ దృష్టి

  •  ఒకటి ..రెండు రోజుల్లో 13 స్థానాలకు అభ్యర్థుల ఖరారు

Congress : అసెంబ్లి ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. ఈ దిశగా నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. వివిధ దశలలో అభ్యర్థుల వడపోత ప్రక్రియను చేపట్టింది. మరోవైపు మునుపటికి భిన్నంగా ఈసారి పార్టీ టిక్కెట్‌ ఆశించే అభ్యర్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీంతో ఎంపిక ప్రక్రియ అగ్రనేతలకు సవాల్‌గా మారింది. దీంతో సర్వేలను ప్రామణికంగా తీసుకుంటూనే సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని పార్టీ భావిస్తోంది. ఇంకొకవైపు టికెట్ల కోసం కొందరు ఆశావహులు ఢిల్లి లోనే మకాంవేశారు. తమ శక్తిమేరకు లాబీయింగ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలావుండగా గతవారం ఏఐసీసీ 39 మందితో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో మహబూబ్‌నగర్‌ (వంశీచంద్‌ రెడ్డి), జహీరాబాద్‌ ( సురేష్‌ షెట్కర్‌), నల్గొండ (కుందూరు రఘువీర్‌రెడ్డి), మహబూబాబాద్‌ (బలరాంనాయక్‌)లకు చోటు లభించింది. రెండో జాబితా కోసం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఒకటి రొం రోజుల్లో సమావేశం కానుంది. మిగతా 13 పార్లమెంట్‌ నియోజక వర్గాలలో అభ్యర్థులను ఖరారు చేయనుంది.

Congress : సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం..

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సామాజిక న్యాయానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజక వర్గాలకు గాను 5 నియోజక వర్గాలు రిజర్వుడు కాగా, అందులో ఎస్సీలకు 3 (వరంగల్‌, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌), ఎస్టీలకు రెండు (అదిలాబాద్‌, మహబూబాబాద్‌) కేటాయించ బడ్డాయి. మిగతా 12 నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌ భావిస్తున్నది. కనీసం 4 స్థానాలకు బీసీలకు కేటాయించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. తొలి జాబితాలో బీసీ వర్గానికి చెందిన సురేష్‌ షెట్కార్‌కు చోటు లభించడంతో మరో ముగ్గురికి అవకాశం ఉంది.సికింద్రాబాద్‌ నుంచి బొంతు రామ్మోహన్‌ పేరు ప్రతిపాదనకు వచ్చినప్పటికీ, కొందరు సీనియర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తుండగా, అదే స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్‌, సునీల్‌రెడ్డి పోటీపడుతున్నారు. అలాగే, మెదక్‌ నుంచి నీలం మధు ముదిరాజ్‌కు టికెట్‌ దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇక మల్కాజిగిరి నుంచి సీనియర్‌ నేత హరివర్ధన్‌ రెడ్డి టిక్కెట్‌ ఆశిస్తుండగా, సినీ నటుడు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి రేసులో కొచ్చారు. స్క్రీనింగ్‌ కమిటీలో కంచర్ల పేరునే ఫైనల్‌ చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక నాయకులు మాత్రం హరివర్దన్‌రెడ్డి లేదంటే మైనంపల్లికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

Congress : ఖమ్మం ఎవరికో?

ఖమ్మం ఎంపీ సీటులో అభ్యర్థి ఎంపిక అత్యంత సంక్లిష్టంగా మారింది. పార్టీ ముఖ్యనేతలు తమ వారసులను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని అనుకోవడంతో హైకమాండ్‌ ఎటూ తేల్చుకోలేక పోతున్నది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు పొంగులేటి, తుమ్మల వారసుnలు ఈ స్థానంపై కన్నేశారు. అలాగే, కరీంనగర్‌ బరిలో ప్రవీణ్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చినప్పటికీ, ఇక్కడ వెలిచల రాజేంద్రరావు నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది.ఎస్సీ రిజర్వుడు సీట్లలో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. మూడింటిలో రెండు మాదిగలు, ఒకటికి మాల సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తున్నది. అయితే పెద్దపల్లి టిక్కెట్‌ను గడ్డం వంశీ ఆశిస్తున్నారు. అయితే, స్థానిక ఎమ్మెల్యేలు నలుగురు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో అధిష్టానం అయోమయంలో పడింది. ఇక, నాగర్‌కర్నూల్‌ టికెట్‌ కోసం మల్లు రవి, సంపత్‌కుమార్‌ పోటీపడుతున్నారు. అదే విధంగా వరంగల్‌ టికెట్‌ను మాదిగ సామాజిక వర్గానికే ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

Congress : ఆదివాసీలకే ప్రాధాన్యం

ఎస్టీ రిజర్వుడులో మహబూబాబాద్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరామ్‌ నాయక్‌కు టికెట్‌ ఖరారైంది. ఇక అదిలాబాద్‌లోనూ అదే వర్గానికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి బలమైన నేతను చేర్చుకునే ఆలోచన కూడా చేస్తున్నారు.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది