యువకులను పగ బట్టిన ఈగలు .. ఏకంగా పెళ్లిళ్లు కాకుండా చేస్తున్నాయట..!
ఈగలు, దోమలు, చీమలు చూడడానికి చిన్నగా ఉన్నా అవి పెట్టే ఇబ్బంది మామూలుగా ఉండదు. ఇటీవల కొన్ని గ్రామాల్లో చీమల దాడులకు ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వీటి బాధపడలేక చివరికి తమ గ్రామాలను వదిలి వేరే ఊర్లకు వలస వెళ్లారు. ఇలాంటి పరిస్థితి ఓ గ్రామంలో చోటుచేసుకుంది. కాకపోతే చీమలు వల్ల కాదు, ఈగల వల్ల. ఈగలు ఓ గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంతేకాకుండా ఆ ఊరిలో ఈగల కారణంగా యువకులకు పెళ్లిళ్లు కావడం లేదట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నావ్ జిల్లాలో రుద్వార్ అనే గ్రామంలో ఈగల దండయాత్ర కొనసాగుతుంది.
రుద్వార్ అనే గ్రామంలో కొంత కాలంగా ఈగల దండయాత్ర కొనసాగుతుంది. గ్రామంలో ప్రతి ఇంట్లో ఈగలు కనిపిస్తున్నాయి. చుట్టూ ఈగలు చప్పుడు చేస్తూ ఎగురుతుంటే గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో ఆహార పదార్థాలు పానీయాలపై ఈగలు కనిపించడంతో, ఒక్కోసారి తినాలన్నా తాగాలన్న భయపడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఆ బాధ మరింత ఎక్కువ అయింది. ఎంత దారుణం అంటే ఈగల కారణంగా యువకులకు పెళ్లిళ్లు కూడా కావడం లేదు. తమ కూతురిని ఆ ఊరి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు విముఖత చూపిస్తున్నారు.
కొంతమంది యువతులు తమ భర్తకు విడాకులు ఇచ్చి మరి తమ సొంత ఊరికి వెళతామని అంటున్నారు. వారి ఇళ్లకు బంధువులు రావడం కూడా మానేశారు. ఎన్ని కెమికల్స్ పురుగుల మందులు వాడిన ఈగలు మాత్రం పోవడం లేదట. అయితే ఈగలు అంతగా పెరిగిపోవడానికి కారణం ఆ గ్రామ చుట్టుపక్కల పౌల్ట్రీ ఫాం లు ఎక్కువగా ఉండడం. కొంతమంది వ్యాపారులు అక్కడ కోళ్ల వ్యాపారం ప్రారంభించారు. దానికారణంగానే అక్కడ ఈగల బెడద ఎక్కువైందని ప్రజలు అంటున్నారు. ఎలాగైనా సరే గ్రామంలో ఈగల బెడద తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.