7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త.. త్వరలోనే డీఏ పెంపు ప్రకటన
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు రానున్న రోజులలో పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ఏడవ పే కమిషన్ సూచనలు మేరకు కరువు భత్యం (డీఏ) 4 శాతం మేర పెరగబోతోందని, స్థూలంగా మూలవేతనంలో డీఏ 38 శాతానికి చేరుకుంటుందని, ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగుల భారీగా జీతాలు పెరుగుతాయని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ పెంచుతుంది. జనవరిలో ఓసారి, జూలైలో మరోసారి డీఏ పెరుగుతుంది. జూలై 1న డీఏ పెరుగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూశారు.
కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.ఆగస్టులో డీఏ పెంపు ప్రకటన వెలువడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నెల బకాయి కూడా ఉంటుంది. దీని ప్రకారం జీతం భారీగానే పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు ద ఆలిండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) మే నెల గణాంకాలు కూడా డీఏ పెంపును సూచిస్తున్నాయి. సాధారణంగా ఆర్‌బీఐ పేర్కొనే ప్రామాణిక గణాంకం 2-6కన్నా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల డీఏ కూడా భారీగానే పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత మార్చిలో 3 శాతం డీఏ పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. జనవరి 1నుంచి వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. దాంతో డీఏ మూలవేతనంలో 34 శాతానికి పెరిగింది.
7th Pay Commission : డీఏ పెంపు..
ఇప్పుడు మరో 4 శాతం డీఏ పెరిగే సూచనలున్నాయి. 4 శాతం పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 38 శాతానికి చేరుతుంది. రూ.18,000 బేసిక్ జీతం కోసం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుతం 34 శాతం ఆధారంగా నెలకు రూ.6120 డీఏగా పొందుతున్నారు. కొత్తగా ప్రకటించే డీఏతో అది 6840 రూపాయలు అవుతుంది. అంటే నెలవారీ డీఏ రూ.720 పెంపు, కాగా ఏడాదికి రూ.8,640 అవుతుంది . గరిష్టంగా రూ.56,000 వేతనం ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుతం నెలవారీ రూ.19,346 పొందుతున్నారు. పెంపుతో ఈ మొత్తం నెలకు రూ.2,276 పెరిగి రూ.21,622కి చేరుకుంటుంది. అంటే ఏటా రూ.27,312 పెరుగుతుందన్నమాట.