Frogs | బామ్మ ఎంత పని చేసింది.. బతికున్న 8 కప్పలని మింగగా, తర్వాత ఏమైందంటే..
Frogs | తూర్పు చైనాకు చెందిన 82 ఏళ్ల ముసలావిడ జాంగ్.. నడుము నొప్పితో బాధ పడుతోంది. అయితే బతికి ఉన్న కప్పలను తినడం వల్ల తన నొప్పి తగ్గుతుందని భావించింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా.. తన కోసం కొన్ని కప్పలను పట్టుకోవాలని కుటుంబ సభ్యులను కోరింది. దీంతో వారు తీసుకువచ్చిన వాటిలో మూడు కప్పలను ఒకరోజు.. తర్వాత రోజు 5 కప్పలను బతికుండగానే మింగేసింది జాంగ్. అన్నీ పెద్దవారి అరచేతి పరిమాణం కంటే చిన్నవిగా ఉన్నాయి.
#image_title
ఎంత పని చేసింది..
కప్పలను మింగిన తర్వాత జాంగ్ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ సెప్టెంబర్ ప్రారంభంలో జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలోని ఒక ఆసుపత్రిలో చేరింది. కప్పలను తిన్న తర్వాత తన తల్లి నడవలేకపోయిందని ఆమె కుమారుడు తెలిపాడు. క్రమంగా కొన్ని రోజుల్లో నొప్పి తీవ్రమైంది. ఏమైందని ఆరా తీస్తే.. అప్పుడు తన కుటుంబానికి తాను ఏమి చేసిందో చెప్పింది వృద్ధురాలు.
అనంతరం ఆమెను జెజియాంగ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రికి తరలించారు. అక్కడ జాంగ్‌ను పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో కణితి లాంటిది లేదన్నారు. అయితే, అధిక సంఖ్యలో ఆక్సిఫిల్ కణాలు ఉన్నట్లు తెలిపారు. ఇది పారాసైట్ ఇన్ఫెక్షన్లు లేదా రక్త రుగ్మతలను సూచిస్తుందని తెలిపారు. తదుపరి పరీక్షల తర్వాత జాంగ్‌కు నిజంగా పారాసైట్ ఇన్ఫెక్షన్లు సోకినట్లు నిర్ధరణ అయింది. కాగా, కప్పలను మింగడం వల్ల ముసలావిడ జీర్ణవ్యవస్థ దెబ్బతిందని.. స్పార్గనమ్‌తో (sparganum) సహా పలు రకాల పరాన్నజీవులు ఆమె శరీరంలో ఉన్నాయి అని ఆసుపత్రి వైద్యుడు ఒకరు చెప్పారు. రెండు వారాల చికిత్స తర్వాత జాంగ్‌ను డిశ్చార్జ్ చేశారు.