Telugu News Papers : 2024 ఎన్నికల తర్వాత ప్రధాన పత్రికలు మూతపడబోతున్నాయా?
Telugu News Papers : 2024 ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది.. అంటే కేంద్రంలో, రాష్ట్రాల్లో రాజకీయాలు మారబోతున్నాయి అని అంటారు కావచ్చు. అయితే మళ్లీ మోదీ ప్రధాని అవుతారు.. లేదంటే ఇంకొకరు కానీ.. ఇక్కడ మనం మాట్లాడుకునేది తెలుగు పత్రికల గురించి. అవును.. వార్తా పత్రికల పరిస్థితి అంతా బాగోలేదని ఇప్పుడు కాదు కరోనా ముందు నుంచే అంతా అనుకున్నారు. వార పత్రికలు, నెల వారి పత్రికలను పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా మూసేశాయి. తాజాగా ఈనాడు నుంచి వచ్చే అన్నదాత మేగజైన్ కూడా మూతపడిపోయింది. దీంతో మళ్లీ వార్తా పత్రికల భవిష్యత్తుపై తెలుగు మీడియా సర్కిల్ లో చర్చ ప్రారంభమైంది. నిజానికి.. వార్తా పత్రికలు ఈరోజుల్లో నిజాలను నిర్భయంగా రాస్తున్నాయా అనేది పక్కన పెడితే..
రాజకీయ పార్టీలకు మాత్రం వమ్ము కాస్తున్నాయి. ఒక పార్టీకి ఒక పత్రిక అన్నట్టుగా తయారైంది. దీంతో ప్రజలు కూడా రాజకీయా పార్టీల్లాగానే వార్తాపత్రికలను కూడా నమ్మడం మానేశారు. దానికి తోడు పత్రికల వ్యయం, నిర్వహణ కూడా భారం కాబోతోంది. డిజిటల్ మీడియా రావడం ఒక మైనస్ అయితే.. పేపర్ ధరలు విపరీతంగా పెరగడం, కేంద్రం విధించే సుంకాలు పెరగడంతో వార్తాపత్రికలను మోయడం సంస్థలకు భారంగానే ఉంది. రాజకీయ పార్టీలకు పత్రికలు డప్పు కొట్టినంత కాలం వాటికి మనుగడ లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే.. నిజాలు రాస్తేనే కదా జనాలు కూడా పత్రికలను చదివేది. నిజాలు రాయడం పక్కన పెట్టి పత్రికలన్నీ కేవలం రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ నాయకుల కోసం పనిచేస్తే జనాలు ఎందకు పత్రికలను చదవాలి.
Telugu News Papers : డప్పు కొట్టినంత కాలం పేపర్ కు మనుగడ లేదు
అందుకే జనాలు వాటిపై ఏవగించుకుంటున్నారు. పత్రికలను కొనేవారు, చదివేవారు లేనప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా ప్రింటింగ్ రంగం మీద పడుతుంది. లాభం పక్కన పెడితే.. రోజూ నష్టాలే చవిచూస్తుంటే పత్రికలను నిర్వహించడం ఎందుకు అనే ధోరణిలో ప్రధాన మీడియా సంస్థలన్నీ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే.. పెద్ద పెద్ద పత్రికలు కూడా 2024 ఎన్నికల తర్వాత మూసేయాలని చూస్తున్నాయని అంటున్నారు. ప్రధాన పత్రికలన్నీ 2024 ఎన్నికల తర్వాత మూతపడతాయా? ఒకవేళ మూతపడిపోతే.. అందులో పనిచేసే ఉద్యోగుల సంగతేంటి అంటే అది దేవుడికే తెలియాలి.