AP Capital : అధ్యక్షా.. ఇంతకీ ఏపీ రాజధాని ఏంటి..? దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చినట్టేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Capital : అధ్యక్షా.. ఇంతకీ ఏపీ రాజధాని ఏంటి..? దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చినట్టేనా..?

 Authored By sukanya | The Telugu News | Updated on :30 August 2021,9:30 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటీ? ఈ ప్రశ్నకు ప్రతి ఆంధ్రుడి నుంచి వెంటనే వచ్చే సమాధానం అమరావతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏపీకి రాజధానిగా 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని ఖరారు చేసింది. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి పునాదులు కూడా పడ్డాయి. అమరావతి నిర్మాణ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని 2015లోనే కేంద్రం కూడా నోటి ఫై చేయడం జరిగింది. రాజధానిలో నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. సచివాలయంతో పాటు అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు చకచకా పూర్తి కావడంతో అక్కడి నుంచే పాలన సాగుతోంది. 2019 నవంబర్ లో మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది వైఎస్ జగన్ సర్కార్. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని తెలిపింది.

AP Capital Issue

AP Capital Issue

ఏపీ మూడు రాజధానులకు సంబంధించిన సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు ఆగస్టు, 2020లో గవర్నర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజముద్ర వేశారు. అయితే మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమరావతి రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అమరావతి తరలింపుకు సంబంధించి రైతులతో పాటు ఇతరులు ఏపీ హైకోర్టులో దాదాపు వంద వరకు కేసులు వేశారు. వీటిపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకు అమరావతి రాజధాని తరలింపు సాధ్యం కాదు. కోర్టు కేసులు తేలేవరకు ఏం చేయలేమని క్లారిటీ ఉంది కాబట్టే రాజధాని విషయంలో జగన్ సర్కార్ సైలెంట్ అయింది.

డాక్యుమెంట్ లో వెల్లడి.. AP Capital

ఏపీ రాజధాని అంశం హైకోర్టులో ఉండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం అమరావతి విషయంలో ఆటలాడుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఓ డాక్యుమెంట్ తీవ్ర వివాదస్పమవుతోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటికి సంబంధించి లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నలు అడిగారు. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎంత ట్యాక్స్ వసూల్ చేస్తుందన్నది వాళ్ల ప్రశ్న. కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జూలై 26న లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అందులో దేశంలోని అన్ని రాష్ట్రాలు విధిస్తున్న పెట్రోల్, డీజిల్ పన్నులు.. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ధరలను పొందుపరిచారు. అయితే ఇందులో రాష్ట్రాల రాజధానుల దగ్గర ఏపీకి వచ్చేసరికి విశాఖ అని ఉంది. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

AP Capital Issue

AP Capital Issue

ఏపీ రాజధాని విశాఖ అని కేంద్రం లోక్ సభకు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఉండటంతో, ఏపీకి రాజధానిగా విశాఖను కేంద్రం అంగీకరించిందా అన్న చర్చ సాగుతోంది. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంతో వైసీపీలో సంతోషం వ్యక్తం అవుతుండగా.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. కేంద్ర సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమరావతి అంశం హైకోర్టు పరిధిలో ఉంది. అమరావతి కేసులపై విచారణ కొనసాగుతోంది. ఆగస్టు 23న కూడా విచారణ జరిగింది. తదుపరి విచారణకు నవంబర్ కు వాయిదా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు పరిధిలో ఉన్న అంశంలో కేంద్రం విశాఖను రాజధానిగా ఎలా పొందుపరిచిందని ప్రశ్నిస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన విషయంలో కేంద్ర సర్కార్ ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహిరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి.

దిద్దుబాటు చర్యల్లో కేంద్రం.. AP Capital

రాజధాని వ్యవహారంపై దుమారం రేగడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. విశాఖ అన్న దగ్గర కేపిటల్‌ సిటీ లేక రిఫరెన్స్‌ సిటీగా చదువుకోవాలని ఒక నోట్‌ విడుదల చేసింది. అయితే గత నెల 26న 
తేదీన సభలో అడిగిన 84వ నంబరు ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానానికి దాదాపు నెలరోజుల తర్వాత సవరణ చేసినట్లైంది. కేంద్రం తన వివరణలో ఈ సమాధానం ద్వారా విశాఖపట్నం 
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా చెప్పడం తమ ఉద్దేశం కాదంటోంది. పెట్రో పెరుగుదలకు సంబంధించి దాన్ని ఒక ప్రతిపాదిత నగరంగా మాత్రమే ఉదహరించినట్లు పేర్కొంది.

ys jagan ap cm ys jagan sketch for second time victory

ys-jagan-ap-cm-ys-jagan-sketch-for-second-time-victory

పెట్రో ధరల పెరుగుదల వల్ల దేశంపై ప్రభావం గురించి జులై 26న ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివిధ రాష్ట్రాల్లోని నగరాల్లో విధిస్తున్న పన్నులను చెప్పారు. రాష్ట్రాల పేర్లు దాని పక్కన రాజధాని/ నగరం అని ఉండాల్సిన చోట కేవలం రాజధాని అని మాత్రమే ఉందని పేర్కొంది. విశాఖనే కాకుండా హర్యానాకు అంబాలా, పంజాబ్‌కు జలంధర్‌ అని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ తప్పును సరిదిద్దుకుంటున్నట్లు పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది