రాజకీయ నిరుద్యోగుల కోసం ప్రజాధనం వృథా చేస్తారా.. ఏపీ సీఎం జగన్ తీరుపై విమర్శలు..!
Political Jobs: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తన పార్టీలోని రాజకీయ నిరుద్యోగుల కోసం ఆర్భాటంగా పదవులు పంచారు. రాష్ట్రంలోని 137 కార్పోరేషన్లకు చైర్మన్‌లతోపాటు పాలకవర్గాలను కూడా నియమించారు. ఇందులో రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులు 71 ఉండగా.. మరో 66 జిల్లా స్థాయి పదవులు ఉన్నాయి. దాంతో ఇన్నాళ్లు పదవులు లేవని మదనపడ్డ నాయకులు తమకూ కొలువు దొరికిందని సంబురపడుతున్నారు. అధికార పార్టీ తమ నేతలకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టడం కామనే గానీ.. సీఎం జగన్ ఇచ్చిన పదవుల్లో మాత్రం గతంలో ఎప్పుడూ లేని పదవులు ఉన్నాయట. ఆ పదవుల పేర్లు కూడా ఇదివరలో ఎవరూ వినలేదట. అంటే జగన్ లేని పదవులు సృష్టించి మరీ తన వాళ్లకు కట్టబెట్టాడన్న మాట.
Political Jobs: కార్పోరేషన్‌లను ముక్కలు చేసి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలే ఆర్ధికంగా నానా అవస్థలు పడుతున్నది. గట్టిగా చెప్పాలంటే ఉద్యోగులకు జీతాలు సర్దుబాటు చేసేందుకే ఆపసోపాలు పడాల్సి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ అంటే ఆర్థికంగా గుదిబండగానే చెప్పవచ్చు. పైగా మరీ ఇన్నేసి పదవులు పంచడం అంటే ఆశ్చర్యం అనిపించక మానదు. కానీ, తమ వారికి పదవులు కావాలి.. కాబట్టి జగన్ చాలా తెలివిగా ఉన్న కార్పోరేషన్లను ముక్కలు చేసి మరీ కొత్త పదవులు సృష్టించారు. ఒక్కో కార్పోరేషన్‌లో కనీసం నలుగురికీ ఉపాధి కల్పించారు. అయితే, ఈ పదవుల విధులు ఏంటో, విధానాలు ఏంటో ఎవరికీ తెలియదు. అంతే కాదు వీటికి నిధులు ఎట్లా సమకూరుస్తారో కూడా అర్ధంకానీ ప్రశ్న.
Political Jobs: జగన్ సృష్టించిన పదవులు..
వాస్తవానికి నాట్యం, సంగీతం, సాహిత్యం ఇలా అన్ని విభాగాలు కలిపి ఒకప్పుడు సాంస్కృతిక కార్పోరేషన్ ఉండేది. దాన్ని ఇపుడు నాలుగు భాగాలుగా చేసి జగన్ తలా ఒకటి పంచేశారు. అది కూడా కళారంగంలో అనుభవం ఉన్నవారికి కాకుండా తమ పార్టీ అనుయాయులకే ఇచ్చుకున్నారు. దీనిపై మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ విమర్శలు గుప్పించారు. కళలు, భాష అంటే అంత చిన్న చూపా అంటూ నిలదీశారు. మరో వైపు ఆర్టీసీ ప్రభుత్వానికి చెందినది. ఆ మధ్య విలీన ప్రక్రియ కూడా పూర్తి చేశారు. మరి దానికి కార్పోరేషన్ అని చెప్పడం విడ్డూరమే. ఆర్టీసీ కార్పోరేషన్‌ను కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాన్ని విడగొట్టి పదవులు ఇచ్చేశారట. ఇవే కాదు సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ అండ్ ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పోరేషన్, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్పోరేషన్, నగరాభివృద్ధి సంస్థల పేరిట పదవులు పంచిపెట్టారట.
Political Jobs: పదవులు ఒకే.. నిధుల్లేవు, ఆఫీసుల్లేవు
సీఎం జగన్ పదవులు సృష్టించారుగానీ, వాటికి కార్యాలయం, స్టాఫ్, నిధులు ఇవన్నీ ఎవరు ఇస్తారన్నదే ప్రశ్నగా మారింది. గతంలో 56 బీసీ కార్పోరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. వాళ్లు దాదాపు ఏడు వంద మంది దాకా ఉంటారు. కానీ ఇప్పటికీ వాళ్లకు కూడా ఆఫీసులు లేవు, నిధులు లేవు. జీతాలు కూడా సరిగా రావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇపుడు కొత్తగా నామినేటెడ్ పదవులు సృష్టించారు. వారందరికీ ఆఫీసులు ఏర్పాటు చేయడం, జీతాలు సమకూర్చడం కష్టమైన పనే. ఆర్థికంగా ఇబ్బందులున్నా మరి ఇన్నేసి పదవులు ఎందుకిచ్చారు అంటే.. గొప్పగా చెప్పుకోవడం కోసం, పేరు పక్కన రాసుకోవడం కోసం అని తెలుస్తున్నది. చూశారుగా.. ఏదేమైనా రాజు తలుచుకుంటే పదవులకు కొదువ ఉండదని ఏపీ సీఎం జగన్ మరోసారి నిరూపించారు.