YS Jagan : ప్రత్యేక హోదా ఇవ్వండి సార్.. ప్రధానికి సీఎం జగన్ వినతి..!
YS Jagan : విశాఖలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీతో పాటు సీఎం జగన్ చేసిన ప్రసంగం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది. ఈ సభకు భారీ ఎత్తున జనాలు రావడంతో… సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వేదికపై ప్రధాని మోడీతో పాటు గవర్నర్ బీశ్వ భూషణ్ హరిచందన్, సీఎం జగన్ ఇంకా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాత్రమే కూర్చోవడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీతో అనుబంధం రాజకీయాలకు మరియు పార్టీలకు అతీతమని తెలిపారు.
గత మూడున్నర సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఉత్తరాంధ్ర జనం ప్రభంజనం మాదిరిగా మారిందని పేర్కొన్నారు. 8 సంవత్సరాల క్రితం రాష్ట్రానికి విభజనతో అతిపెద్ద గాయం అయిందని… ఇంకా ఆ గాయం మానలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు మరియు సహృదయులు అయిన ప్రధాని మోడీ మమ్మల్ని ఆశీర్వదించాలి.
మీరు అందించే ప్రతి సహకారం మరియు సాయం ఇంకా రాష్ట్రానికి వచ్చే ప్రతి రూపాయి.. ప్రతి సంస్థ..రాష్ట్ర నిర్మాణానికి దోహదపడతాయి. ఇక ఇదే సందర్భంలో విభజన హామీలు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం, స్టీల్ ప్లాంట్ విజ్ఞప్తులు పరిశీలించాలని.. మోడీని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో ఎజెండా తమకు లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అదే విధంగా మోడీతో ఉన్న అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతమని స్పష్టం చేశారు.