Raghurama case : ఎంపీ రఘురామకృష్ణంరాజు మెడికల్ రిపోర్ట్ వచ్చేసింది.. ఆర్మీ ఆసుపత్రి సంచలన రిపోర్ట్?
Raghurama case : ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆయన చేసిన విమర్శలకు, అకారణంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంపై ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత సీఐడీ అధికారులు విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గుంటూరులోని మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తికి రఘురామకృష్ణంరాజు లిఖిత పూర్వకంగా లేఖ కూడా రాశారు. తనను విచారణ పేరుతో సీఐడీ అధికారులు తీవ్రంగా కొట్టారని ఆయన ఫిర్యాదు చేశారు.
దీంతో.. రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించి.. రిపోర్టు అందించాలంటూ… న్యాయమూర్తి మెడికల్ బోర్డును ఆదేశించారు. అయితే.. మెడికల్ బోర్డు తరుపున వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని.. అది ఎడిమా అనే సమస్య వల్ల కాళ్లు నల్లబడ్డాయని తెలిపారు. అయితే.. కావాలని డాక్టర్లు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని.. తన తండ్రికి ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ రఘురామ కొడుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో వెంటనే సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. దాని ప్రకారం.. ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్టును హైకోర్టు రిజిస్ట్రార్ కు పంపించగా.. రిజిస్ట్రార్ ఆ రిపోర్టును సుప్రీం కోర్టుకు పంపించారు. తాజాగా శుక్రవారం ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగగా… ఆ రిపోర్టును కోర్టు పరిశీలించింది. ఆర్మీ డాక్టర్లు పంపించిన రిపోర్టులో ఎక్స్ రే, రిపోర్టు, వీడియో ఉన్నట్టు సుప్రీం తెలిపింది.
Raghurama case : సిట్టింగ్ ఎంపీకే ఇలా జరిగితే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి?
అయితే.. రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్.. రఘురామపై దాడి జరిగిందని… జనరల్ ఎడిమాతో పాటు ఆయన కాలికి గాయాలున్నట్టు రిపోర్టులో ఉందని పేర్కొన్నారు. వెంటనే రఘురామకృష్ణంరాజు తరుపు లాయర్ ముకుల్ రోహిత్గీ తమ వాదనలను సుప్రీంకోర్టుకు వినిపించారు. ఒక ఎంపీనే ఇలా కస్టడీలో చిత్రహింసలకు గురి చేస్తే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలొద్దు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి.. అని కోర్టును ముకుల్ కోరారు.
ఏపీ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన.. దుష్యంత్ దవే.. గాయాలు నిజమే అయినప్పుడు అవి ఆయన చేసుకున్నవా? కాదా? అనేది కూడా తేలాల్సి ఉంది.. అని కోర్టుకు తెలిపారు. అయితే.. దుష్యంత్ వాదనలపై స్పందించిన కోర్టు.. ఆసుపత్రికి వెళ్లేముందు.. ఎంపీనే స్వయంగా గాయాలను చేసుకున్నారా? అని ప్రశ్నించింది. రిపోర్టులను ఏపీ ప్రభుత్వానికి, లాయర్లకు మెయిల్ చేస్తామని కోర్టు తెలిపింది.