బండి సంజయ్ కి ఉన్న అదృష్టంలో ఆవగింజంత కూడా ఏపీ బీజేపీ నాయకులకు లేదు?
బండి సంజయ్.. 2019 సాధారణ ఎన్నికలకు ముందు అసలు తెలంగాణ ప్రజలకు కూడా తెలియదు. ఆయన కరీంనగర్ జిల్లాలో బీజేపీ నాయకుడు మాత్రమే కానీ.. ఆయన 2019 ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా కరీంనగర్ లో గెలుస్తారని.. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఎక్కుతారని.. ఆ తర్వాత ఆయన సారథ్యంలో దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలుస్తుందని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అదే మరి.. ఆయన పట్టుకున్నదల్లా బంగారం అయిపోతుంటే ఆయన మాత్రం ఏం చేస్తారు. కరీంనగర్ ఎంపీగా ఎప్పుడైతే గెలిచారో.. అప్పటి నుంచి ఆయన దశే మారిపోయింది. తెలంగాణ మొత్తం బండి సంజయ్ గురించి మాట్లాడుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ దూకుడు మీదుంది. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా మాదే విజయం అంటూ.. ఉత్సాహంతో ఉన్నారు బీజేపీ నేతలు.
అధికార పార్టీ టీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు బండి సంజయ్. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతోనే తెలిసిపోయింది. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బలపడిందంటే.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారిందంటే దానికి కారణం బండి సంజయ్ కూడా. పార్టీని బలోపేతం చేయడంలో బండి సక్సెస్ అయ్యారు.
ఓవైపు టీఆర్ఎస్ పార్టీని.. మరోవైపు ఎంఐఎం పార్టీని.. నిలువరిస్తూ… ఎక్కడికక్కడ పార్టీలపై విమర్శలు చేస్తూ.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ ఓకే కానీ.. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీ పరిస్థితి ఏంటి.. ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటో ఇంకా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అక్కడ ఉన్న ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీలను దాటుకొని బీజేపీ అక్కడ పాగా వేయాలంటే కొంచెం కష్టమే.
అందుకే.. ఏపీ బీజేపీ నాయకులు బండి సంజయ్ ని గుడ్డిగా ఫాలో అవుతున్నారు. ఏపీలో బీజేపీని స్ట్రాంగ్ చేయడం కోసం ఎంత కష్టపడుతున్నా.. ఫలితం మాత్రం దక్కడం లేదు. ఏపీ ప్రజల్లో బీజేపీ మీద మొదటి నుంచి వ్యతిరేకత ఉన్నది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కానీ.. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో.. ఏపీ బీజేపీ నాయకులు ఎంత కష్టపడినా.. ఫలితం మాత్రం దక్కడం లేదట. ఓవైపు బండి సంజయ్ ని కేంద్రంలోని పెద్దలు మెచ్చుకుంటుంటే.. ఏపీ బీజేపీ నాయకులు మాత్రం తమకేమీ గుర్తింపు లభించడం లేదంటూ తెగ బాధపడిపోతున్నారట.