Elections : ఎన్నికల ఫలితాలపై స్టాంప్ పేపర్ తో బెట్టింగ్…!
Elections : ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల గెలుపు, ఓటములపై బెట్టింగ్ కడుతున్న ఇద్దరు వ్యక్తులను ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ బైస్లా, ఇక్బాల్ అనే ఇద్దరు యువకులు నంద్ కిషోర్ గుర్జార్, మదన్ భయ్యా విజయంపై స్టాంప్ పేపర్‌పై రూ.18,000 పందెం కట్టారు. ఘజియాబాద్ జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా… అందులో రెండు స్థానాలపై బెట్టింగ్ వేసారు.
లోనీలో ఆర్‌ఎల్‌డీకి చెందిన మదన్ భయ్యా (62)పై సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్ (46) పోటీ చేస్తున్నారు. నంద్ కిషోర్ గుర్జార్ 2017లో బీఎస్పీకి చెందిన జాకీర్ అలీ, ఆర్ఎల్డీకి చెందిన మదన్ భయ్యాపై విజయం సాధించారు.
అగ్రిమెంట్ చేసుకున్న స్టాంప్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.షరతుల ప్రకారం, మార్చి 10న ఫలితాలు వెలువడిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థి మద్దతుదారుడు మార్చి 15న గెలిచిన అభ్యర్థి మద్దతుదారుడికి రూ.18,000 ఇవ్వాల్సి ఉంటుంది. అమిత్ బైంస్లా బిజెపికి మద్దతు ఇస్తుండగా ఇక్బాల్ SP-RLD కూటమికి మద్దతు ఇస్తున్నాడు.