CM Nitish Kumar : బీజేపీతో విడాకులు: ప్రకటించిన బీహార్ సీఎం నితీష్ కుమార్.!
CM Nitish Kumar : జేడీయూ నేత నితీష్ కుమార్ అంటే రాజకీయాల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు వుంది. దేశ రాజకీయాల్లో తరచూ ఆయన పేరు ప్రముఖంగానే వినిపిస్తుంటుంది. అయితే, ఒకప్పటి నితీష్ కుమార్ వేరు, ఇప్పుడు వేరు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగే దిశగా నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జేడీయూ అంతర్గత సమావేశంలో నితీష్ కుమార్ ఆ నిర్ణయాన్ని ప్రకటించేశారు కూడా. బీజేపీ – జేడీయూ కలిసి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
నిజానికి, కాంగ్రెస్ అలాగే ఆర్జేడీలతో కలిసి గతంలో రాజకీయం చేశారు నితీష్ కుమార్. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకీ, ఆర్జేడీకీ షాకిచ్చి, బీజేపీతో నితీష్ కుమార్ చేతులు కలపడం అప్పట్లో పెను సంచలనమైంది. ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి వచ్చింది. గతంలో ఎవర్ని అయితే వదులుకున్నారో, తిరిగి వాళ్ళతోనే నితీష్ కుమార్ కలుపుకుపోనున్నారు. ఆర్జేడీ అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ. ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌కి హోంమంత్రి పదవి ఇవ్వబోతున్నారిప్పుడు నితీష్ కుమార్. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఈ విషయమై గవర్నర్‌కి ఇప్పటికే జేడీయూ సమాచారం పంపడం గమనార్హం.
అయితే, తమను కాదని ముందడుగు వేస్తే ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసంటూ నితీష్ కుమార్‌కి బీజేపీ హెచ్చరికలు జారీ చేస్తోంది. కలగూర గంప లాంటి కూటమి ఎన్నాళ్ళు అధికారంలో వుంటుందో తామూ చూస్తామని బీజేపీ హెచ్చరిస్తుండడం గమనార్హం. ఇలా ప్రభుత్వాల్ని కూల్చడంలో బీజేపీ ఎప్పుడో మాస్టర్ డిగ్రీ చేసేసింది. కాగా, మహారాష్ట్రలో ఉద్దశ్ ధాక్రే ప్రభుత్వాన్ని షిండే వర్గంతో కలిసి ముంచేసిన బీజేపీ, ఇప్పుడు బీహార్‌లో మునిగిపోవడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘నువ్వు నేర్పిన విద్యయే..’ అంటూ బీజేపీ మీద సెటైర్లు పడుతున్నాయి.