YSRCP : వైసీపీ వైపు చూస్తోన్న బీజేపీ.! కారణం అదేనా.?
YSRCP : ఇప్పటికైతే బీజేపీ, జనసేన పార్టీ అధికారికంగా మిత్రపక్షాలుగా వున్నాయి. అనధికారికంగా చూసుకుంటే, బీజేపీలోని చంద్రబాబు అనుకూల వర్గం కారణంగా బీజేపీ, అప్పుడప్పుడూ టీడీపీ వైపు ఊగిసలాడుతోంది. జనసేన విషయంలోనూ బీజేపీ ఏమంత ఖచ్చితత్వంతో లేదు. ఎందుకంటే, బీజేపీతో పొత్తులో వుండి కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ వలపు బాణాలకు కరిగిపోతోంది.2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. టీడీపీ – జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.
మరి, బీజేపీ సంగతేంటి.? ‘మాకు జనంతోనే పొత్తు, అవసరమైతే జనసేనతో పొత్తు..’ అంటూ ఇటీవల బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారమే చెలరేగింది.‘అవసరం లేకపోతే, మిత్రపక్షం జనసేన పార్టీని పక్కన పెడతాం’ అనే మాట వీర్రాజు వ్యాఖ్యలతో పరోక్షంగా వినిపించింది చాలామంది మీడియా మిత్రులకి. రాజకీయ విశ్లేషకులూ ఇదే అర్థాన్ని తీస్తున్నారు. అయితే, రాష్ట్రంలో రాజకీయాల విషయమై కేంద్ర నాయకత్వం ఆరా తీస్తోందనీ, మారుతున్న సమీకరణాల నేపథ్యంలో జనసేనను పక్కన పెట్టడమే మంచిదనే నిర్ణయానికి బీజేపీ అధిష్టానం వచ్చిందనీ అంటున్నారు.
రాజ్యసభలో వైసీపీ బలం, బీజేపీకి అవసరం. వరుసగా రెండు సార్లు దేశంలో అధికారం చేపట్టిన దరిమిలా, 2024 ఎన్నికల్లో పరిస్థితులు ఎలా వుంటాయో బీజేపీకి తెలుసు. సరిపడా మెజార్టీ రాకపోతే, వైసీపీ లాంటి పార్టీల సహకారం అవసరమవుతుంది. అందుకే, వచ్చే ఎన్నికల్లో వైసీపీతో కలిసి వెళితే ఎలా వుంటుందని బీజేపీ ఆలోచిస్తోందట. ఓ రెండు ఎంపీ స్థానాలు, ఓ పది అసెంబ్లీ స్థానాల్ని బీజేపీ ఆశిస్తోందట వైసీపీ నుంచి.