YCP – BJP : అమరావతిపై బీజేపీ మొసలి కన్నీళ్ళు.! వైసీపీపై విమర్శలేల.?
YCP – BJP : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ బీజేపీ రాజకీయం చేయాలనుకుంటోంది. ఈ మేరకు రాజధానిలో బీజేపీ నేతలు పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్ర ముగిసింది కూడా. చంద్రబాబుకి అత్యంత సన్నహితుడైన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి (ఇప్పుడు బీజేపీలో వున్నారు) ఈ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొని వైసీపీ ప్రభుత్వంపై చిత్ర విచిత్రమైన విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు పొరపాట్లు చేశారనీ, అలాంటి పొరపాట్లు 2024లో మళ్ళీ చేస్తే ఇక బాగుపడటం కష్టమేనంటూ సుజనా చౌదరి వ్యాఖ్యానిస్తే, అదే వేదికపై వున్న మిగతా బీజేపీ నేతలు కూడా ఇంచు మించు అలాగే మాట్లాడారు. ప్రధానంగా అమరావతి అంశానికి సంబంధించి వైసీపీ మీద నిందలు మోపడమే పనిగా పెట్టుకున్నారు ఏపీ బీజేపీ నేతలు.
అసలు అమరావతి వెనుక కథేంటి.? అది కథ కాదు వ్యధ.. అంటారు చాలామంది. అందులో నిజం లేకపోలేదు కూడా. పచ్చని పంట పొలాలున్న ప్రాంతంలో రాజధానిని ఎంపిక చేయడమే తొలి తప్పిదం. అభివృద్ధి చెందిన విశాఖపట్నం సహా రాష్ట్రంలో అనేక ముఖ్య నగరాలున్నాయి. దేన్నో ఒకదాన్ని రాజధానిగా ప్రకటించుకుంటే, కొత్త రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం వుండేదికాదు. అప్పట్లో టీడీపీతో కలిసి రాజధాని రాజకీయం చేసిన బీజేపీ, ఆ తర్వాత ‘మాకేంటి సంబంధం.?’ అంటూ చేతులు దులిపేసుకుంది.
ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఎగ్గొట్టింది కూడా బీజేపీనే. పోలవరం ప్రాజెక్టుకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నది బీజేపీ కాక ఇంకెవరు.? అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ, విశాఖపట్నం అలాగే కర్నూలు నగరాల్ని రాజధాని హోదాలో (కార్య నిర్వాహక రాజధాని, న్యాయ రాజధాని) అభివృద్ధి చేయాలని వైసీపీ సర్కారు ప్రయత్నిస్తే, దానికీ సహకరించలేదు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ. ఏ మొహం పెట్టుకుని వైసీపీ మీద అమరావతి సాక్షిగా బీజేపీ విమర్శలు చేయగలుగుతుంది.? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.