Cheekatilo Movie Review : శోభిత ధూళిపాళ ‘చీకటిలో’మూవీ రివ్యూ .. అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Cheekatilo Movie Review : శోభిత ధూళిపాళ ‘చీకటిలో’మూవీ రివ్యూ .. అండ్ రేటింగ్..!
Cheekatilo Review : శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘చీకటిలో’ నేడు జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో విశ్వదేవ్ రాచకొండ, చైతన్య కృష్ణ, అదితి మ్యాకెల్, ఆమని, శ్రీనివాస్ వడ్లమాని, రవీంద్ర విజయ్, ఝాన్సీ, ఈషా చావ్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురేష్ బాబు నిర్మాణంలో, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ దశ నుంచే ఆసక్తిని రేకెత్తించింది.
Cheekatilo Movie Review : శోభిత ధూళిపాళ ‘చీకటిలో’మూవీ రివ్యూ .. అండ్ రేటింగ్..!
Cheekatilo Movie Review : కథ విషయానికొస్తే..
సంధ్య (శోభిత ధూళిపాళ) ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో క్రైమ్ న్యూస్ ప్రజెంటర్. ఛానల్ టీఆర్పీల కోసం వార్తల్ని మలచే విధానం నచ్చక ఛానల్ హెడ్‌తో విభేదించి ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. తన ఇంటర్న్ బాబీ (అదితి మ్యాకెల్) సూచనతో, బాయ్‌ఫ్రెండ్ అమర్ (విశ్వదేవ్ రాచకొండ) సహకారంతో ‘చీకటిలో’ అనే క్రైమ్ పాడ్‌కాస్ట్‌ను ప్రారంభిస్తుంది. అయితే పాడ్‌కాస్ట్ మొదలైన కొద్దిసేపటికే బాబీ అతని బాయ్‌ఫ్రెండ్ దారుణంగా హత్యకు గురవుతారు. ఈ కేసును పోలీస్ ఆఫీసర్ రాజీవ్ (చైతన్య కృష్ణ) దర్యాప్తు చేస్తున్నప్పటికీ సంధ్య తనదైన కోణంలో పరిశోధన చేసి పాడ్‌కాస్ట్‌లో వివరాలు చెబుతుంది. అది వైరల్‌గా మారి ప్రజల్లో పోలీసుల్లో చర్చకు దారి తీస్తుంది. ఇదే సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి సంధ్యకు హెచ్చరికలు చేస్తాడు. మరోవైపు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఓ మహిళ కాల్ ముప్పై ఏళ్ల క్రితం ఇలాగే జరిగిన సంఘటనను బయటపెడుతుంది. అప్పటి ఘటనలు ఇప్పటి హత్యలకు ఏమైనా సంబంధమా? అసలు నిందితుడు ఎవరు? ఈ మిస్టరీని సంధ్య పోలీసులు ఎలా ఛేదించారు అన్నది తెలుసుకోవాలంటే ‘చీకటిలో’ చూడాల్సిందే.
Cheekatilo Movie Review : సినిమా విశ్లేషణ..
నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ నటించిన తొలి సినిమా కావడం చాలా కాలం తర్వాత ఆమె డైరెక్ట్ తెలుగు సినిమా చేయడం వల్ల ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. రొటీన్ మర్డర్ మిస్టరీ ఫార్మాట్‌లోనే కథ సాగినా 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలతో లింక్ చేస్తూ కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రతి సీన్ తర్వాత ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల సీరియస్‌నెస్ పేరుతో కథను కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం పెద్ద ప్లస్. చివరి వరకు విలన్ ఎవరో ఊహించలేకపోవడం ఈ సినిమాకు బలంగా నిలిచింది. ఎందుకు ఈ హత్యలు జరిగాయి అనే కారణాన్ని కూడా భావోద్వేగంగా చూపించారు. అయితే పాడ్‌కాస్ట్ ఏ ప్లాట్‌ఫామ్‌లో వస్తుంది. అది గ్రామాల వరకూ ఎలా చేరుతుంది అన్న విషయాల్లో స్పష్టత లేకపోవడం అలాగే క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని డిటేల్స్‌కు లాజిక్ పూర్తిగా ఇవ్వకపోవడం మైనస్ పాయింట్స్.
Cheekatilo Movie Review : నటీనటుల పర్ఫార్మెన్స్..
శోభిత ధూళిపాళ ధైర్యమైన స్వతంత్ర మహిళ పాత్రలో పూర్తిగా లీనమైంది. ఆమె డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్‌లో తెలుగు అమ్మాయి సహజత్వం కనిపిస్తుంది. విశ్వదేవ్ రాచకొండ సపోర్టివ్ అయినా కొంచెం కన్‌ఫ్లిక్ట్ ఉన్న బాయ్‌ఫ్రెండ్ పాత్రలో మెప్పించాడు. అదితి మ్యాకెల్ చిన్న పాత్రలోనే మంచి ఇంపాక్ట్ చూపించింది. చైతన్య కృష్ణ, ఝాన్సీ, ఆమని, రవీంద్ర విజయ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. విలన్ రివీల్ సమయంలో వచ్చే సర్ప్రైజ్ కూడా బాగా వర్కౌట్ అయింది.
Cheekatilo Movie Review :సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ డార్క్ టోన్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయింది. లైటింగ్, కలర్ ప్యాటర్న్స్ కథను మరింత గాఢంగా చూపించాయి. ఎడిటింగ్ ఓకే అనిపించినా కొన్ని సన్నివేశాలు మరింత క్రిస్పీగా ఉంటే బాగుండేది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్‌ను పెంచింది. మొత్తంగా ‘చీకటిలో’ ఓ బాగున్న సస్పెన్స్ థ్రిల్లర్. శోభిత ధూళిపాళ కంబ్యాక్ సినిమాగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది. ఈ సినిమాకు 2.75/5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.