YS Jagan : అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు, జగన్ నయా ప్లాన్ ఇదే..!
YS Jagan : ఏపీలో సీఎం జగన్ అనుకొని చేయలేకపోయిన, మధ్యలో ఆగిపోయిన పనులు ఏవైనా ఉన్నాయి అంటే అది మూడు రాజధానుల అంశం. అవును.. మూడు రాజధానులు అంటూ ప్రకటించి చాలా రోజులు అవుతున్నా అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు అమరావతి రాజధాని అంశం కూడా ఇంకా నానుతూనే ఉంది. వచ్చే నెలలో ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అలాగే.. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ ముఖ్యమంత్రి అయి కూడా నాలుగేళ్లు అయింది.
ఇంకో సంవత్సరంలో మళ్లీ ఎన్నికల హడావుడి. ఈలోపు మూడు రాజధానుల అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలనేదే సీఎం జగన్ ప్లాన్. అందుకే.. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో మరోసారి ఈ బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఇదివరకే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. న్యాయపరమైన చిక్కులు రావడంతో ఆ బిల్లు అలాగే పెండింగ్ లో ఉంది. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులను తీసుకొస్తున్నామని సీఎం జగన్ చాలా సార్లు స్పష్టం చేశారు.
YS Jagan : మూడు ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్లనున్న ప్రభుత్వం
కానీ.. ఆ న్యాయపరమైన చిక్కులను తప్పించుకొని ఎన్నికలు వచ్చే వరకు మూడు రాజధానులు ఏర్పాటు కావాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే పరిస్థితి ఉండదని.. అందుకే ఈ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల అంశాన్ని ఒక కొలిక్కి తేవాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకోవడానికి కూడా సీఎం జగన్ యత్నిస్తున్నారు. చూద్దాం మరి మూడు రాజధానుల అంశం ఇంకా ఎంత దూరం వెళ్తుందో?