Telangana Education Sector: తెలంగాణ విద్యా రంగం విషయంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Telangana Education Sector : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఆయన సూచించారు. ముఖ్యంగా హాజరు శాతాన్ని పెంచేందుకు విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. దీని ద్వారా వృత్తి విద్యా సంస్థల్లో ఉన్న లోపాలను కూడా అరికట్టవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. విద్యా రంగ అభివృద్ధిని పెట్టుబడిగా భావించి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

Telangana Education Sector
విద్యా సంస్థల నిర్మాణ పనుల విషయంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. అదనపు గదులు, వంట గదులు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం వేర్వేరు విభాగాల ఆధ్వర్యంలో కాకుండా ఒకే విభాగం పరిధిలో కొనసాగాలని ఆదేశించారు. ప్రస్తుతం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ (EWIDC) కింద రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల నిర్మాణాలు చేపట్టాలని ఆయన సూచించారు. నాణ్యత, పర్యవేక్షణ, నిధుల వినియోగంపై పూర్తి బాధ్యత ఈ సంస్థకే అప్పగించాలని సీఎం స్పష్టం చేశారు.
మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్యం, బాలికల భద్రత, క్రీడల ప్రాధాన్యం వంటి అంశాలపై కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన బిల్లులు గ్రీన్ ఛానల్ ద్వారా తక్షణమే చెల్లించాలని, బాలికల పాఠశాలలు, మహిళా కళాశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం వేగవంతం చేయాలని అన్నారు. ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి మహిళా కౌన్సెలర్లను నియమించాలని ఆయన తెలిపారు. ఈ చర్యలతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.