Digital Arrest | పహల్గాం ఉగ్రదాడిని కూడా వాడేసుకున్న నేరస్తులు .. 26 లక్షలు కోల్పోయిన వృద్ధుడు
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్ పేరుతో ఘరానా మోసం వెలుగుచూసింది. ఈ మోసంలో ఓ 68 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి లక్షల్లో డబ్బు కోల్పోయారు.

#image_title
ఘరానా మోసం..
ఓ రోజు వృద్ధుడికి కాల్ చేసిన నిందితులు భయపెట్టడం ప్రారంభించారు. తమను యాంటి టెర్రర్ స్వాడ్ (Anti-Terror Squad) సభ్యులమని పరిచయం చేసుకున్నారు. ఆయనపై పహల్గాం ఉగ్రదాడి కేసులో ప్రమేయం ఉందని, ఉగ్రవాదులకు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేశారని, మనీలాండరింగ్ జరిగిందని అభియోగాలూ మోపారు.
బాధితుడిని మానసికంగా వత్తిడి చేసి, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అని బెదిరించారు. ఆయన భయంతోపాటు ఆందోళనకు లోనై, నిందితుల మాటలు నమ్మిపోయారు. విచారణకు సహకరించాలంటూ ఆన్‌లైన్‌లోనే డబ్బు చెల్లించాలని కోరారు. అంతటితో ఆగకుండా, ఫిక్స్డ్ డిపాజిట్‌తో పాటు భార్య పేరుమీద ఉన్న రూ. 20 లక్షలు సహా మొత్తం రూ. 26 లక్షలు వారి ఖాతాలకు బదిలీ చేశారు.ఈ తరువాత విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పగానే, ఇది నకిలీ కేసు అని, మోసపోయినట్లు వారు గుర్తించారు. వెంటనే బాధితుడు సైబర్ నేరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి వివరాలు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.