ఈటల కొత్తపార్టీ పేరు ఇదేనా..?
2014 లో తెరాస అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎవరు చేయని సాహసానికి సిద్ధమైయ్యాడు తెరాస సీనియర్ నేత మాజీ మంత్రి Etela Rajendar. తనకు పార్టీలో సరైన గుర్తింపు దక్కటం లేదని ఒక పక్క ఈటల అంటుంటే మరోపక్క ఈటల పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ వచ్చాడని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెరాస వర్గాలు అంటున్నాయి.
ఇద్దరి వాదనలు కాసేపు పక్కన పెడితే, దాదాపుగా ఈటల తెరాస కు గుడ్ బై చెప్పబోతున్నాడని సృష్టంగా అర్ధం అవుతుంది, మరి ఈ నేపథ్యంలో ఈటెల రాజకీయ భవిష్యత్ ఎలా వుండబోతుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈటల రాజేందర్ ను ప్రభుత్వం ఎప్పుడైతే భూకబ్జా దారుడని తేల్చిందో ఆ మరుక్షణమే కాంగ్రెస్, బీజేపీ ఆయన్ను తమ పార్టీల్లోకి లాగాలని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆయన అవినీతిపరుడని ప్రభుత్వం చెబుతోందికాని కోర్టు తేల్చలేదు.కానీ ఈటలను ఆయుధంగా చేసుకొని కేసీఆర్ మీద దాడి చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈటల అవినీతిపరుడా, కాదా అనేది చెప్పలేం. కానీ సౌమ్యుడిగా పేరుంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోడు.
అయితే ఆయన అభిమానులు మాత్రం కాంగ్రెస్ లోగానీ, బీజేపీలోగానీ చేరవద్దని, సొంతగా పార్టీ పెట్టాలని ఆయన మీద ఒత్తిడి తీసుకోని వస్తున్నారు. వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి, అదే సమయంలో తనతో కలిసి వచ్చే వాళ్ళ మద్దతు ఏమిటో తెలుసుకొని అన్ని అనుకూలంగా ఉంటే ఈటల కొత్త పార్టీ పెట్టటం ఖాయం. బహుజన రాజ్యం అనే పేరుతో పార్టీ పెట్టబోతున్నాడని గతంలో సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. కొంతకాలం తరువాత అది మరుగున పడిపోయింది. ఒకవేళ ఈటల వేరే ఏ పార్టీలో చేరకుండా తానే సొంతంగా కేసీఆర్ తో, టీఆర్ఎస్ తో ఫైట్ చెయ్యాలనుకుంటే సొంతంగా పార్టీ పెడతాడు. దానికి బహుజనరాజ్యం అని పేరు పెడతాడో, మరో పేరు పెడతాడో చెప్పలేం.
తెలంగాణలోని బీసీల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న వర్గం ముదిరాజ్. ఈ కమ్యూనిటీకి చెందిన నేతకు పరాభవం జరిగింది కాబట్టి.. ఈటల ఈ కోణంలో ఆందోళనను లేవనెత్తొచ్చని, 50శాతం బీసీల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నది ముదిరాజ్ లేనని, వాళ్లందర్నీ ఒక్కటి చేస్తే ఈటల ఉద్యమం సక్సెస్ అవుతుందని అంటున్నారు కొందరు విశ్లేషకులు. ప్రస్తుతం ఈటల కొన్ని వర్గాల్లో హీరోగా మారాడు. కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు వచ్చాడని నమ్ముతున్నారు. మరి ఈటెల ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.