Telangana Ration: రేషన్ లబ్దిదారులకు శుభవార్త.. సన్నబియ్యంతో పాటు.. ఈ ఐదు రకాల సరుకులు కూడా..!
ప్రధానాంశాలు:
Telangana Ration: రేషన్ లబ్దిదారులకు శుభవార్త.. సన్నబియ్యంతో పాటు.. ఈ ఐదు రకాల సరుకులు కూడా..!
Telangana Ration: రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి రేషన్ వ్యవస్థలో కీలకమైన మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ బియ్యం లబ్ధిదారులకు సన్నబియ్యం మాత్రమే కాకుండా ఐదు రకాల నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయాలనే ప్రణాళికను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. పేదలకు కడుపు నిండా భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడబోమని లబ్ధిదారులకు మెరుగైన ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. ఈ మేరకు తాజాగా జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ధాన్య సంపదకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ సందర్భంగా రైతుల కష్టానికి తగిన గుర్తింపు లభిస్తోందని పేర్కొన్నారు.
Telangana Ration: రేషన్ లబ్దిదారులకు శుభవార్త.. సన్నబియ్యంతో పాటు.. ఈ ఐదు రకాల సరుకులు కూడా..!
Telangana Ration: ధాన్య సేకరణలో చరిత్రాత్మక విజయం
తెలంగాణ రాష్ట్రం ధాన్య సేకరణలో మరో కొత్త మైలురాయిని చేరిందని మంత్రి తెలిపారు. వానాకాలం సీజన్‌లో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం ద్వారా 25 ఏళ్ల చరిత్రలోనే రికార్డు సాధించిందన్నారు. గతంలో నమోదైన 70.20 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును ఈ ఖరీఫ్‌లో అధిగమించడం రాష్ట్ర రైతాంగ కృషికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన మొత్తం ధాన్యంలో 32.45 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం కాగా, 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలు ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో 20కు పైగా సన్నవరి రకాలు సాగులో ఉండగా, సాంబా మసూరి, తెలంగాణ మసూరికి అధిక డిమాండ్ ఉందన్నారు. ఇక నుంచి రైతులు మేలు జాతి వరి విత్తనాలతో పంట సాగు చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో 14.21 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాల్లో రూ.17,018 కోట్లను జమ చేసినట్లు వెల్లడించారు. అలాగే సన్న వరికి ప్రకటించిన రూ.500 బోనస్ కింద ఇప్పటి వరకు రూ.1,425 కోట్లు రైతులకు అందించామని చెప్పారు. ధాన్య సేకరణలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, నల్లగొండ రెండో స్థానం, కామారెడ్డి మూడో స్థానం దక్కించుకున్నాయని తెలిపారు.
Telangana Ration: గోదాములు, మిల్లింగ్, ఎగుమతులపై నూతన విధానాలు
ధాన్యం నిల్వల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గోదాముల్లో ప్రస్తుతం 29 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉందని, అయితే పాత సాంకేతిక విధానాలతో నిర్వహణ జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇక నుంచి ఆధునిక సాంకేతికతను వినియోగించి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర సహకారంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్త గోదాముల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. వచ్చే యాసంగి సీజన్‌లో డిఫాల్టర్ మిల్లులకు ధాన్యం కేటాయింపు ఉండదని స్పష్టం చేశారు. జిల్లా అధికారులు నిబంధనలకు లోబడి కఠిన నిర్ణయాలు అమలు చేయాలని ఆదేశించారు. అదనపు ఉత్పత్తిని పెట్టుబడిగా మార్చే దిశగా ఎగుమతి ఆధారిత బియ్యం మిల్లులను ప్రోత్సహించేందుకు కొత్త విధానాలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం, దేశం వెలుపల బియ్యం ఎగుమతి చేసే మిల్లులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. తెలంగాణలో మిల్లింగ్ పరిశ్రమ ప్రధాన ఆర్థిక వనరుగా ఎదుగుతోందని మంచి పనితీరు కనబరుస్తున్న మిల్లులకు కొత్త మార్కెట్లను అందిపుచ్చుకునేలా ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమగ్ర విధానాల ద్వారా రైతులు, వినియోగదారులు, పరిశ్రమలు అందరికీ మేలు చేకూరేలా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.