Gorantla Madhav : ఏపీ సీఐడీకి గోరంట్ల మాధవ్ ఫిర్యాదు.! టీడీపీ ఖేల్ ఖతం.?
Gorantla Madhav : తెలుగు దేశం పార్టీ ముచ్చట తీర్చేలా వైసీపీ నేత, హిందూపురం లోక్ సభ సభ్యుడు గోరంట్ల మాధవ్, ఏపీ సీఐడీని ఆశ్రయించారు. తనపై తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేసిందనీ, దాన్ని కొనసాగిస్తోందనీ, తన పరువుకు నష్టం కలిగించేలా టీడీపీ నేతలు వ్యవహరించారనీ ఏపీ సీఐడీకి చేసిన ఫిర్యాదులో గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. కొన్నాళ్ళ క్రితం గోరంట్ల మాధవ్‌కి చెందినదిగా చెబుతూ ఓ వీడియోను టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆ వీడియో ద్వారా అత్యంత అసభ్యకరమైన రీతిలో గోరంట్ల మాధవ్ మీద దుష్ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ ఘటనకు సంబంధించి గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారని హోంమంత్రి చెప్పగా, ఎలాంటి ఫిర్యాదూ చేయలేదని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చెప్పడం కొంత గందరగోళానికి తావిచ్చింది. దాన్ని పట్టుకుని టీడీపీ నేతలు మరింతగా చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ స్వయంగా ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే, గోరంట్ల మాధవ్ ఫిర్యాదు కంటే ముందుగానే ఏపీ సీఐడీ ఈ కేసు గురించి స్పందించింది. టీడీపీ చేయించిన ఫేక్ ‘ఫోరెన్సిక్’ రిపోర్టు విషయమై ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేయక ముందు వ్యవహారం.
ఇప్పుడైతే ఆయనే నేరుగా ఫిర్యాదు చేశారు. సో, ఈ కేసులో పలువురు టీడీపీ నేతలకు షాక్ తగిలే అవకాశాలు లేకపోలేదు. వరుసగా అరెస్టులు కూడా జరగొచ్చునని అంటున్నారు. అధికార పార్టీ ఎంపీ కదా, పోలీసు శాఖ నుంచీ చర్యలు వేగంగా వుండడంలో వింతేముంది.? తీరా అరెస్టులు జరిగాక, ‘అరెస్టులు అక్రమం..’ అని తెలుగుదేశం పార్టీ నేతలు నినదించినా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ వుండదు. దమ్ముంటే అరెస్టు చేయమని నినదించేదీ వాళ్ళే.. అరెస్టయ్యాక ‘అక్రమ అరెస్టులు’ అని గగ్గోలు పెట్టేదీ వాళ్ళే..