Harbhajan Singh : మరీ ఇంత దిగజారి ప్రవర్తిస్తారా.. యువీ, భజ్జీ, రైనాలపై దివ్యాంగులు ఫైర్
ప్రధానాంశాలు:
Harbhajan Singh : మరీ ఇంత దిగజారి ప్రవర్తిస్తారా.. యువీ, భజ్జీ, రైనాలపై దివ్యాంగులు ఫైర్
Harbhajan Singh : టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ బ్యాటర్ సురేశ్ రైనా లేని పోని చిక్కులు కొని తెచ్చుకున్నారు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ నెగ్గిన జోష్‌లో ఈ ముగ్గురు చేసిన ఓ వీడియో వివాదంలో నిలిచింది.దీనిపై దివ్యాంగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టైటిల్ గెలిచిన తర్వాత యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా.. బాలీవుడ్ మూవీ ‘బ్యాడ్ న్యూస్’లోని తౌబా తౌబా హుక్ స్టెప్‌ను ఇమిటేట్ చేస్తూ రీల్ చేశారు. ఆ వీడియోలో ఈ ముగ్గురు కూడా నడుము పట్టుకుని, కుంటుకుంటూ నడుస్తూ కనిపించారు. వీడియోని వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ .. ’15 రోజుల లెజెండ్స్ క్రికెట్ తర్వాత మా శరీరాలు కూడా తౌబా తౌబా అయ్యాయి.
Harbhajan Singh తప్పు తెలుసుకున్నాం..
శరీరంలో ప్రతీ అవయవం నొప్పిగా ఉంది. ఇది మా వెర్షన్ ‘తౌబా తౌబా’ అంటూ రాసుకొచ్చారు. దీనిపై దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీయడమేనని, ఇలాంటి అమర్యాదకర ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం అని వారు అన్నారు . ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సిన మీరు దివ్యాంగులని ఎగతాళి చేయడం సిగ్గు చేటు అని అన్నారు. బీసీసీఐ వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ డిమాండ్ చేశారు.
పారా అథ్లెట్లు సైతం ఈ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లపై దుమ్మెత్తి పోసారు. దాంతో హర్భజన్ సింగ్ ఆ రీల్ వీడియోను తొలగించడంతో క్షమాపణలు చెప్పాడు.ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని ఆ వీడియో తీయలేదని, 15 రోజులు ఆడిన తర్వాత నొప్పులతో తమ శరీరాలు అలా అయ్యాయని చెప్పే ప్రయత్నం చేశామన్నాడు. తెలియక జరిగిన తప్పుకు మన్నించాలని కోరాడు. ‘ఇంగ్లండ్‌లో ఛాంపియన్‌షిప్ గెలిచిన అనంతరం మేం చేసిన టౌబా టౌబా రీల్‌పై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలనుకుంటున్నా.ఎవర్ని కించపర్చడం మా ఉద్దేశం కాదు. ఇప్పటికీ ఎవరైనా మేం తప్పు చేశామని భావిస్తే వారందరికి మా క్షమాపణలు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని సుదీర్ఘ పోస్ట్‌లో రాసుకొచ్చాడు భజ్జీ.