Harish Rao : మంత్రి హరీష్ రావుకి అగ్ని పరీక్షేనా..?
Harish rao : తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోతూ పోతూ ఆర్థిక మంత్రి హరీష్ రావు Harish rao కి పరీక్షలు పెట్టాడు. తన లాగే మంత్రులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర అవమానకర పరిస్థితుల్లో ఉంటున్నారంటూ ఈటల బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఈటల అంతటితో ఆగకుండా సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు సైతం ప్రగతిభవన్ లో ఎన్నోసార్లు అవమానపడ్డాడని ఆరోపించాడు. ఈటల ఇలా అనటం ద్వారా హరీష్ రావుని, టీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టానని సంబరపడ్డాడు. కానీ ఈటల కామెంట్లను హరీష్ రావు తిప్పికొట్టాడు. తన మేనమామ, ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు టీఆర్ఎస్ పార్టీ పట్ల తన విధేయతను చాటుకున్నాడు.
తన స్థానం.. తనకే..
2009 ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ, కమ్యూనిస్టులు కలిసి కట్టిన మహా కూటమి ఓడిపోవటం, తదనంతర పరిణామాల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హరీష్ రావుపై ‘ఆపరేషన్ ఆకర్ష’ని ప్రయోగించారని అప్పట్లో అన్నారు. దీంతో అప్పటివరకు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాతి స్థానం హరీష్ రావుదే అన్నట్లు ఉండేది. ఎందుకంటే అప్పటికి కేసీఆర్ కొడుకు కేటీఆర్ గానీ కూతురు కవిత గానీ పార్టీలోకి రాలేదు. అయితే హరీష్ రావుపై కేసీఆర్ కి అనుమానం రావటంతో కాస్త దూరం పెట్టాడు. అందువల్ల హరీష్ రావు స్థానంలోకి ఈటల రాజేందర్ రాగలిగాడు. ఈటల టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవటంతో ఆ పొజిషన్ మళ్లీ ఇప్పుడు హరీష్ రావుకే దక్కనుంది.
మరోసారి టఫ్ జాబ్.. : Harish rao
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు అన్నీ తానై వ్యవహరించినా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు చేతిలో గులాబీ పార్టీకి ఓటమి తప్పలేదు. అయితే ఆ ఓటమికి తనదే బాధ్యత అని ఒప్పుకున్న హరీష్ రావు తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ బై ఎలక్షన్లలో అంత యాక్టివ్ గా పాల్గొనలేదు. కానీ మళ్లీ ఇప్పుడు ఈటల రాజేందర్ నియోజకవర్గమైన హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీని గెలుపు బాట పట్టించాల్సిన బాధ్యతలను తీసుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పోరాడతానన్న మాటకు కట్టుబడ్డాడు.
గెలిచినా.. ఓడినా..
హుజూరాబాద్ కూడా దుబ్బాక మాదిరిగా టీఆర్ఎస్ విజయానికి తక్కువ అవకాశాలు ఉన్న నియోజకవర్గం. అయినా హరీష్ రావు Harish rao తన పార్టీ క్యాండేట్ ని నెగ్గించుకునేందుకు బరిలోకి దిగుతున్నాడు. ఒకవేళ ఈటల చేతిలో ఓడిపోయినా దానికి బాధ్యత వహించేందుకు కూడా హరీష్ రావు మానసికంగా సిద్ధంగా ఉన్నాడు. దీన్నిబట్టి హరీష్ రావు మరోసారి తన మంచి పేరు(ఎన్నికల్లో విజయానికి మారుపేరు)ను త్యాగం చేయటానికి రెడీగా ఉన్నాడు. ఈటల రాజేందర్ పెట్టిన విశ్వాస పరీక్షలో ఇప్పటికే నెగ్గిన హరీష్ రావు ఇక ఉపఎన్నిక పరీక్షలో సక్సెస్ అవుతాడా లేక పోరాడి ఓడిపోతాడా అనేది కాలమే చెప్పాలి.