Telangana Bjp : తెలంగాణలో బీజేపీ బలపడ్డా.. కేసీఆర్ కే ప్లస్సా…?
Telangana Bjp : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నట్లు అనిపిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం తదితర పార్టీల్లోని అసంతృప్త నేతల చేరికతో కమలం పార్టీ వికసిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే కాషాయం పార్టీ నిజంగానే గుభాళిస్తోందా?. వచ్చే శాసన సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇస్తుందా? అంటే అంత సీన్ లేదని అంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించటంలో బీజేపీ తానూ ఒక చెయ్యి వేసింది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి నాలుగైదు ఎమ్మెల్యే స్థానాలను, మూడు నాలుగు ఎంపీ సీట్లను బహుమతిగా ఇస్తున్నారు. అంతే తప్ప అధికారంలోకి వచ్చే రేంజ్ లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించరనే అంచనాలు నెలకొన్నాయి.
వాళ్లే కారణం..
ప్రస్తుతం తెలంగాణ నుంచి పార్లమెంట్ లో, అసెంబ్లీలో బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని, అధికార పార్టీ టీఆర్ఎస్ ని అవమానకర రీతిలో విమర్శిస్తున్నారు. స్థాయిని మరచి మాట్లాడుతున్నారు. బీజేపీ భారతదేశం మొత్తం అధికారంలో ఉందని, టీఆర్ఎస్ ఆఫ్ట్రాల్ ఒక ప్రాంతీయ పార్టీ అని దెప్పిపొడుస్తున్నారు.
దీన్నిబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలపై కమలనాథులకు ఏమాత్రం గౌరవం ఉందో అర్థంచేసుకోవచ్చు. ప్రాంతీయ పార్టీ అయితే మాత్రం దానికి ప్రజామోదం లేదా?. దానికి రాష్ట్రాన్ని పాలించే సామర్థ్యం లేదా?. జాతీయ పార్టీ అయితేనే గొప్పా? అని ఆత్మగౌరవం కలిగిన తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా మనస్తత్వం కలిగిన పార్టీలోకి ఎంత మంది నాయకులు వెళ్లినా జనం హర్షించరని చెబుతున్నారు.
ఎవరున్నా.. ఏం చేయగలిగారు?..: Telangana Bjp
తెలంగాణ బీజేపీలోకి ఇప్పటికే చాలా మంది ఇతర పార్టీల నేతలు వెళ్లిపోయారు. డీకే అరుణ, స్వామిగౌడ్, గడ్డం వివేక్, నాగం జనార్ధన్ రెడ్డి, ఎ.చంద్రశేఖర్, నోముల నర్సింహయ్య, పెద్దిరెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి తదితరులు కమలం పార్టీలో చేరారు. కానీ నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గానీ వాళ్ల ప్రభావమేమీ కాషాయం పార్టీకి కనిపించలేదు. ఇవాళ ఈటల రాజేందర్ సైతం బీజేపీలో చేరారు. రేప్పొద్దున కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వాళ్లు కూడా జాయిన్ అయ్యే సూచనలు ఉన్నాయి. కానీ వీళ్లెవరూ బీజేపీని రూలింగ్ పార్టీ లెవల్ కి తీసుకురాలేరు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును రాబట్టుకొని మరో రెండు మూడు సీట్లు అదనంగా పొందగలరేమో గానీ టీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించేంత స్టామినా లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాబట్టి తెలంగాణ బీజేపీ తాత్కాలికంగా బలపడ్డా సీఎం కేసీఆర్ కి వచ్చే నష్టమేమీ లేదని, ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీపై పడుతుందని వివరిస్తున్నారు.