హైదరాబాద్ లో భారీ వర్షం.. నీటమునిగిన పలు కాలనీలు.. నాగోల్ లో అత్యధిక వర్షపాతం నమోదు
హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నగరంలో విపరీతంగా వర్షం కురిసింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు కాలనీలు మునిగిపోయాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఎల్బీనగర్, ఉప్పల్ పరిధిలో కొన్ని కాలనీలు నీట మునిగిపోయాయి.
రాత్రి అత్యధికంగా వర్షం కురిసిన ప్రాంతాల్లో నాగోల్ ఉంది. అక్కడ 21.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. బుధవారం రాత్రి 9 నుంచి గురువారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. ప్రశాంత్ నగర్ లో 19.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. హస్తినాపురంలో 19 సెం.మీ, హయత్ నగర్ లో 17.1 సెం.మీ, సరూర్ నగర్ లో 17.9 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. ఉప్పల్ రామాంతపూర్ లో 17.1 సెం.మీ, రాజేంద్రనగర్ లో 12.8 సెం.మీ, ముషీరాబాద్ లో 11.5 సెం.మీ వర్షపాతం నమోదు అయింది.
భారీగా కురిసిన వర్షానికి.. అంబర్ పేట, కాచిగూడ, నల్లకుంట ప్రాంతాల్లోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ముసారాంబాగ్ వంతెన పై వరకు మూసీ నీళ్లు చేరుకోగా.. ఆ రూట్ లో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మల్లిఖార్జున నగర్, అయ్యప్పనగర్, త్యాగరాజనగర్ లో కాలనీల్లోకి నీరు చేరడంతో.. అక్కడి కాలనీ వాసులు ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.