Heavy Rains | ఏపీలో వర్షాల అలర్ట్: మూడు రోజులు భారీ వర్షాలు… వాతావరణ శాఖ హెచ్చరిక
Heavy Rains | ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు విజృంభించబోతున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
#image_title
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, గురువారం సాయంత్రం లేదా అర్ధరాత్రి మధ్య గోపాల్‌పూర్ – పారాదీప్ (ఒడిశా) తీరాన్ని దాటి వెళ్లే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం విశాఖపట్నానికి 300 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 300 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది.
అమరావతి వాతావరణ కేంద్రం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ లెక్కల ప్రకారం, ఈ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్టణం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.