Vijayendra Prasad : విజయేంద్ర ప్రసాద్‌కి రాజ్యసభ ఎలా దక్కిందబ్బా.?
Vijayendra Prasad : సినీ రచయిత విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రాష్ట్రపతి కోటాలో విజయేంద్రప్రసాద్ సహా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ అథ్లెట్ పరుగుల రాణి పీటీ ఉష; సామాజిక వేత్త వీరేంద్ర హెగ్దే రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, మిగతా ముగ్గురి విషయంలో రాని అభ్యంతరాలు, విజయేంద్రప్రసాద్ విషయంలో మాత్రం వస్తున్నాయి. ఎందుకిలా.? విజయేంద్రప్రసాద్ ప్రముఖ సినీ రచయిత. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించారు.
ఆ లెక్కన, అంతకన్నా గొప్ప కథలు అందించిన సినీ రచయితలు దేశంలో ఎంతమంది లేరు.? అలా ప్రశ్నించుకుంటూ పోతే, ఇళయరాజా కంటే గొప్ప సంగీత దర్శకులు లేరా.? అన్న ప్రశ్న కూడా వస్తుంది. కానీ, ఇళయరాజాని మించిన సంగీత జ్ఞాని ఇంకెవరుంటారు.? ఛాన్సే లేదు. విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు వెళ్ళనుండడంపై చాలా అనుమానాలున్నాయి. చాలా ప్రశ్నలున్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజనం, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీని ఈ విషయమై ప్రశ్నిస్తూనే వున్నారు. కానీ, బీజేపీ మద్దతుదారుల దగ్గర సరైన సమాధానమే దొరకని పరిస్థితి.
విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు వెళ్ళకూడదా.? అంటే, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ, రాష్ట్రపతి కోటాలో.. ఇదే చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. కేంద్రానికి ఈ అవకాశం వుంది.. ఇలా అకామడేట్ చేసింది.. అనే చర్చ కూడా జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. అంతేనా.? ఇంకేమీ లేదా.? దక్షిణాది నుంచి నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల్ని రాజ్యసభకు నామినేట్ చేయడం ద్వారా బీజేపీ ఓ కొత్త రాజకీయం షురూ చేసిందంటే.. దాన్ని ఎలా ‘కాదు’ అని చెప్పగం.? కానీ, విజయేంద్రప్రసాద్ వల్ల బీజేపీకి కలిగే రాజకీయ లబ్ది ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.