TDP – Janasena : టీడీపీ, జనసేన పంచుకోవాల్సింది పాతిక సీట్లేనా.?
TDP – Janasena : 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.? జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది.? ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే పరిస్థితి ఏంటి.? విడివిడిగా పోటీ చేస్తే సంగతేంటి.? ఈ విషయమై రాష్ట్ర రాజకీయాల్లో చాలా చర్చ నడుస్తోంది. అధికార వైసీపీ అయితే, ఆ రెండు పార్టీలూ కలిసినా, కలవకపోయినా.. తమకు వచ్చే నష్టమేమీ లేదని చెబుతున్న సంగతి తెలిసిందే. ‘జనసేన మాతో కలిసి రావాల్సిందే.. లేదంటే, ఆ పార్టీ రాజకీయ తెరపైనుంచి కనుమరుగైపోతుంది..’
అంటూ టీడీపీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మొదలు పెట్టింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనన్న మాటకు కట్టుబడి జనసేనాని వుండాలన్నది టీడీపీ డిమాండ్. అయితే, టీడీపీని జనసేన ఇప్పుడు లెక్క చేయడంలేదు. సొంతంగా గెలిచేస్తామన్న ధీమా జనసేన నేతల్లో కనిపిస్తోంది. ఇదో రకం డ్రామా.. అన్నది జనసేన మీద వినిపిస్తోన్న విమర్శ. ఎవరు ఎవరితో కలుస్తారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, వైసీపీ మాత్రం సోలోగానే రంగంలోకి దిగబోతోంది. ‘టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే మాకు 174 సీట్లు వస్తాయ్.. విడివిడిగా పోటీ చేస్తే, ఒకటి తగ్గుతుందేమో..’
అంటూ వైసీపీ ఇప్పటికే పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.అయితే, తాజాగా వెలుగు చూస్తోన్న ఓ సర్వే ప్రకారం, రాష్ట్రంలో విపక్షాలకు మొత్తంగా పాతిక సీట్ల వరకూ రావొచ్చునట. వైసీపీకి ఖచ్చితంగా 150 సీట్లు వస్తాయని ఆ సర్వే చెబుతోంది. ఎవరు ఈ సర్వే చేశారు.? అన్నదానిపై స్పష్టత లేదు. విడివిడిగా జనసేన, టీడీపీ పోటీ చేస్తే మాత్రం, విపక్షాలకు మొత్తంగా వచ్చే సీట్లు ఓ రెండు పెరగొచ్చునట. ఎలా చూసుకున్నా, ఆ సీట్లతో, ఆ పార్టీ బలాలతో వైసీపీకి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే, ఎలా చూసుకున్నా, వైసీపీకి 140 ప్లస్ సీట్లు రాబోతున్నాయని దాదాపు అన్ని సర్వేలూ చెబుతున్నాయ్.!