Independence Day : దేశవ్యాప్తంగా జెండా పండుగ.. అంగరంగ వైభవంగా.!
Independence Day : దేశవ్యాప్తంగా ప్రతి యేడాదీ ఆగస్టు 15వ తేదీన, జనవరి 26వ తేదీన జెండా పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. అయితే, ఈసారి ఆగస్ట్ 15వ తేదీన జరగబోయే వేడుకలు మరింత ప్రత్యేకం. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన తరుణంలో, ఆజాదీ కా అమృత మహోత్సవ్ పేరుతో.. గడచిన ఏడాది కాలంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న విషయం విదితమే. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 15 వరకు ఈ కార్యక్రమాల్ని మరింత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రధానంగా, 13 అలాగే 14 మరియు 15 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాల్ని చేపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ కార్యక్రమాల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దేశంలో ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగిరేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే దిశా నిర్దేశం చేసింది. ప్రతి ఇంటికీ జెండాలు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్నాయి. కేంద్రం సమకూర్చే జాతీయ జెండాలకు, రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతుగా కొన్ని జెండాల్ని అదనంగా సమకూర్చి.. ప్రజలకు అందిస్తాయి. కాగా, ప్రతి సోషల్ మీడియా అకౌంట్ కూడా జాతీయ జెండా ప్రొఫైల్ పిక్‌తో వుండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా పిలుపునిచ్చారు.
అంటే, దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశ కీర్తి పతాక కనిపించబోతుందన్నమాట. వాస్తవానికి, ప్రతి యేడాదీ ఆగస్టు 15న అలాగే జనవరి 26న వాట్సాప్ స్టేటస్‌లు, ప్రొఫైల్ పిక్‌లు, సోషల్ మీడియా హ్యాండిళ్ళ ప్రొఫైల్స్‌లో జాతీయ జెండాలు దర్శనమిస్తుంటాయి. అయితే, ఈసారి కొన్ని రోజులపాటు అవి అలాగే కనిపించాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచనగా కనిపిస్తోంది. ఇదిలా వుంటే, ఈ ఆలోచనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జెండా ఆవిష్కరణ తర్వాత వాటిని గౌరవప్రదంగా జాగ్రత్త పెట్టడం అందరికీ కుదురుతుందా.? అన్నది ఓ ప్రశ్న.