National Flag : ఇంటిపై నేషనల్ ఫ్లాగ్ ఎగరేయబోతున్నారా… ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
National Flag : ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలామంది జాతీయ జెండాను తమ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్నారు. అయితే, ఇంటి మీద జెండా ఎగురవేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. వీటితో పాటు భారత దేశపు ఫ్లాగ్ కోడ్ ఏంటో కూడా తెలుసుకుందాం… జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రతి ఒక్కరూ ఫ్లాగ్ కోడ్ 2002 ను అనుసరించాల్సి ఉంది. అలాగే యాంటీ డిఫమేషన్ ఆఫ్ నేషనల్ సింబల్స్ యాక్ట్-1971 నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ కోడ్‌లోని నిబంధన 2.1 ప్రకారం, జాతీయ జెండా పట్ల పూర్తి గౌరవంతో సాధారణ పౌరులు ఏ ప్రదేశంలోనైనా జెండాను ఎగురవేయవచ్చు. అయితే, జాతీయ జెండాను అవమానిస్తే మొదటి తప్పుకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే నిబంధన ఉంది. 2002 జనవరి 26న కొత్త కోడ్ అమల్లోకి వచ్చింది.
ఇటీవల ఈ కోడ్‌లో రెండు ప్రధాన మార్పులు చేశారు. 2022 జూలై 20న చేసిన సవరణ ప్రకారం, ఇప్పుడు జాతీయ జెండాను పగలు, రాత్రి కూడా ఎగురవేయవచ్చు. అది బహిరంగ ప్రదేశమైనా, ఇంటి మీదైనా ఎగరేయడానికి అనుమతి ఉంది. అంతకు ముందు జాతీయ జెండాను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఎగురవేయడానికి అనుమతి ఉండేది. జాతీయ జెండాను పాలిస్టర్ ఫాబ్రిక్‌తో తయారు చేయడానికి 2021 డిసెంబర్ 30 నుంచి అనుమతించారు. గతంలో ఖాదీ వస్త్రంతో మాత్రమే జాతీయ జెండా తయారీకి అనుమతి ఉండేది.
National Flag : ఎగరేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి…
ప్రభుత్వ ఫ్లాగ్ కోడ్ గతంలో చాలా కఠినంగా ఉండేది. ఇప్పుడు దానిని సరళీకృతం చేశారు. కానీ ఈ నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. జెండాను ఎగరేసేటప్పుడు అది చిరిగిపోయి ఉండకూడదు. అలాగే నలిగిపోయిన, తిరగబడిన జెండాను ఎగరవేయరాదు. సరైన స్థలంలోనే జెండాను ఎగరేయాలి. జాతీయ జెండాను ఎగరేసే ఎత్తులో లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండా ఎగురవేయకూడదు. జెండాను ఎలాంటి అలంకరణకు ఉపయోగించకూడదు. జెండాను ఎగురవేసేటప్పుడు, కాషాయ రంగు పైకి ఉండేలా జాగ్రత్త వహించాలి.
అలాగే ధ్వజస్తంభం మీద లేదా జెండాపైన పూలు, ఆకులు, దండలు పెట్టకూడదు. జెండాపై ఏమీ రాయకూడదు. ఏ వస్తువు మీద కప్పడానికి జెండాను ఉపయోగించకూడదు. జెండాను ఎగురవేయడానికి సిద్ధం చేస్తున్నప్పుడు, అవసరమైతే పువ్వులు అందులో ఉంచవచ్చు. జాతీయ జెండా నేల మీద పడేయకూడదు, నీటిపై తేలనీయకూడదు. జెండాను దుస్తులుగా కుట్టించుకోకూడదు. నడుము కింది భాగంలో చుట్టుకోకూడదు. రుమాలుగా, సోఫా కవర్‌గా, న్యాప్‌కిన్‌గా, లోదుస్తుల తయారీకి అస్సలు ఉపయోగించకూడదు. జెండాను ఎగురవేసేటప్పుడు అది ధ్వజస్తంభానికి కుడి వైపున మాత్రమే ఉండాలి.