Janasena – TDP : టీడీపీతో పొత్తు.. జనసేన పునరాలోచనలో పడిందా.?
Janasena – TDP : తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడం వల్ల నష్టం తప్ప, లాభమేమీ వుండదని జనసేన పార్టీ భావిస్తోందట. ఇదే నిజమైతే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు వుండకపోవచ్చు. మహానాడు వేదికగా, ‘అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిపైకి వచ్చి, అధికార వైసీపీకి వ్యతిరేకంగా పోరాడాలి..’ అని చంద్రబాబు పిలుపునిస్తారని జనసేన ఆశించిందట. కానీ, ఆ పిలుపు టీడీపీ అధినేత నుంచి రాకపోవడంతో, చంద్రబాబు నిజస్వరూపం జనసేనానికి అర్థమయ్యిందని అంటున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం మొన్నామధ్య జరిగితే, ఆ వేడుకల్లో జనసేనాని, ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ వ్యాఖ్యానించారు. విపక్షంలో వున్న ఏ రాజకీయ పార్టీ అయినా, అధికార పక్షం ఓటు చీలకూడదనే అనుకోవాలి.
అదొక రాజకీయ సూత్రం. సిద్ధాంతాలు పక్కన పెట్టి విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావడం సబబా? అన్నది వేరే చర్చ. వాస్తవానికి, విపక్షాలన్నీ కలిసొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టమేమీ లేదు. ఎందుకంటే, అంత బలంగా వుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ – జనసేన – బీజేపీ కలిస్తే వైసీపీకి 175 సీట్లు వస్తాయ్.. అవి కలవకపోతే 170 సీట్లు వస్తాయ్.. అని వైసీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. అంత గట్టి నమ్మకంతో వుంది వైసీపీ.. తన బలం మీద.ఇదిలా వుంటే, జనసేన పార్టీకి ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే, ప్రతిపక్షం అనే గొప్ప స్థానాన్ని తెలుగుదేశం పార్టీ దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షం అంటే జనసేన మాత్రమే..
అనేలా జనసైనికులు కష్టపడి, జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా వున్నా, జనసైనికులు మాత్రం, ప్రజలతో మమేకం అవుతూనే వున్నారు. పైగా, వైసీపీ మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని స్వయంగా జనసేన అధినేతే అభినందిస్తున్నారు కూడా. బాద్యతగల ప్రతిపక్షం.. అనిపించుకునే స్థాయికి జనసేన ఎదగాలంటే, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడమే మేలు. ఇదే విషయమై జనసేనలో అంతర్గతంగా చర్చ జరుగుతోందట. కానీ, జనసేనను దెబ్బ తీయడమే లక్ష్యంగా టీడీపీ వ్యవహరిస్తోంది. ఈ విషయంలో వైసీపీ కంటే, టీడీపీతోనే జనసేనకు ఎక్కువ ప్రమాదమని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.